కొల్లాపూర్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వాన్ని కొందరు చోరీ చేసేందుకు ప్రయత్నించడం దారుణమని.. కమ్యూనిస్టుల పోరాటాలతోనే భూస్వాముల నుంచి పేదలకు విముక్తి లభించిందని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎండీ ఫయాజ్ అన్నారు. శుక్రవారం కొల్లాపూర్‌లో సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతాంగ పోరాటయోధుడు సీఆర్ శర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి.. ఆయన కుటుంబ సభ్యులను శాలువాలతో సత్కరించారు. అనంతరం ఫయాజ్ మాట్లాడుతూ.. రైతాంగ పోరాటంలో క్రియాశీలకంగా వ్యవహరించిన కొల్లాపూర్‌వాసి సీఆర్ శర్మను రజాకార్లు హత్యచేశారన్నారు. కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో కొనసాగిన సాయుధ రైతాంగ పోరాటం దేశంలోని పెత్తందారులు, భూస్వాముల గుండెల్లో గుబులు పుట్టించిందన్నారు. నాటినుంచి నేటివరకు పేద వర్గాల పక్షాన సీపీఐ పోరాటం చేస్తోందని వివరించారు. అమరుల త్యాగాలను వృథా కానివ్వబోమన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు కేశవులుగౌడ్, పెబ్బేటి విజయుడు, తన్నీరు నర్సింహ, ఇందిరమ్మ, ఆర్.చంద్రమోళి, మల్లయ్య, గుర్రపు కురుమయ్య, యూసూఫ్, లక్ష్మీనారాయణ, రాధాకృష్ణ, జంగం శివుడు, కృష్ణ, సాయిలు, బాలస్వామి పాల్గొన్నారు.


