అచ్చంపేట రూరల్: డిజిటల్ ఇండియాలో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను పారదర్శకంగా వేగవంతం చేసేందుకు యూ–విన్ పోర్టల్ ఎంతో కీలకమైందని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డా.సురేశ్‌బాబు అన్నారు. మంగళవారం పట్టణంలోని టీఎన్జీఓ భవనంలో యూ–విన్ పోర్టల్‌పై ఆరోగ్య సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గర్భిణులు, చిన్నారులకు అందించే వ్యాక్సినేషన్ సేవలను డిజిటల్ రూపంలో సమర్థవంతంగా నిర్వహించేందుకు వందశాతం లక్ష్యంతో పనిచేయాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా ప్రతి చిన్నారి, గర్భిణికి అందించే టీకా వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయడం ద్వారా టీకా సర్టిఫికెట్లతో పాటు తదుపరి డోసుల అలర్ట్ సకాలంలో అందుతాయన్నారు. నమోదు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. జిల్లా వ్యాక్సిన్ స్టోర్ మేనేజర్ కుమార్, సిబ్బంది రాజేశ్వర్, బిక్కులాల్, హనుమంతు పాల్గొన్నారు.


