నిబంధనలు ఇవే..
కొత్త పింఛన్ మంజూరుకు వితంతులు, ఒంటరి మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో 30 ఏళ్లు, పట్టణాల్లో 35 ఏళ్ల వయసు ఉండాలి. దివ్యాంగులకు వయసుతో సంబంధం లేకుండా 40శాతం దివ్యాంగత్వం కలిగి ఉండాలి. గీత కార్మికులు 50ఏళ్ల పైబడి, కల్లుగీత కార్మిక సహకార సంఘంలో సభ్యత్వంతో పాటు ఎకై ్సజ్‌శాఖ ధ్రువీకరణ, చేనేత కార్మికులకు సైతం 50 ఏళ్లు పైబడిన వారు అర్హులు. పైలేరియా వ్యాధిగ్రస్తులు వయసుతో సంబంధం లేకుండా గ్రేడ్–2, గ్రేడ్–3 బాధితులై ఉండాలని నిబంధనలు ఉన్నాయి. డయాలసిస్ బాధితులు ఆరోగ్యశ్రీ ద్వారా డయాలసిస్ చికిత్స పొందుతున్న ధ్రువపత్రం సమర్పించాల్సి ఉంటుంది. ఇక దరఖాస్తుదారుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1.50లక్షలలోపు, మూడెకరాలకు మించకుండా తరి భూమి, 7.5 ఎకరాల వరకు నీటిపారుదల లేని భూమి ఉన్నవారు అర్హులు. ఇక లైట్ లేదా హెవీ మోటారు వాహనాలు కలిగి ఉన్న వారు సైతం పింఛన్‌కు అనర్హులు. పెద్ద వ్యాపార సంస్థలు నిర్వహిస్తున్న వారు, కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వారే కాకుండా.. ప్రభుత్వ రంగసంస్థలు, ప్రైవేటు సంస్థల్లో ఔట్‌సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో ఉన్న వారి కుటుంబ సభ్యులు పింఛన్‌కు అనర్హులుగా తేల్చనున్నారు.
నాగర్‌కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం చేయూత సామాజిక భద్రతా పింఛన్ పథకం కింద కొత్తగా కొన్ని వర్గాలకు పింఛన్లు మంజూరు చేయబోతుంది. ఈ మేరకు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ నెల 31 వరకు దరఖాస్తు గడువు విధించింది. అయితే దరఖాస్తు ఫారంలో ఎక్కడా వృద్ధాప్య కాలం లేదు. వారు సైతం దరఖాస్తులు ఇస్తే.. నిరాకరించకుండా తీసుకోవాలని ఉన్నతాధికారులు కిందిస్థాయి సిబ్బందికి మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. అయితే పింఛన్ మంజూరుకు నిబంధనలు కఠినంగా ఉన్నాయి. గతంలో మాదిరిగా కాకుండా పకడ్బందీగా ఒక్కో దరఖాస్తుపై సమగ్ర విచారణ జరిపి.. నిబంధనలకు అనుగుణంగా అర్హులను ఎంపిక చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 360 డిగ్రీల కోణంలో దరఖాస్తుదారుడి కుటుంబం వివరాలను సేకరించనున్నట్లు సమాచారం. ఆ నిబంధనల ప్రకారం చాలా మంది పింఛన్‌కు అనర్హులుగా తేలుతారని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
దరఖాస్తుల వెల్లువ..
కొత్తగా పింఛన్ కోసం అర్హులైన వారు గ్రామ పంచాయతీలు, మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఒక్కో గ్రామంలో 30 నుంచి 100కు పైగా దరఖాస్తులు వచ్చాయి. వృద్ధులకు పింఛన్ మంజూరు చేయకున్నా.. వారు మనస్తాపానికి గురవుతారనే ఉద్దేశంతో వారు ఇచ్చే దరఖాస్తులు సైతం తీసుకుంటున్నారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు పంచాయతీ కార్యదర్శులకు లాగిన్ ఐడీ ఇచ్చారు. మంగళవారం నుంచి దరఖాస్తుల నమోదు ప్రారంభమైంది.
పింఛన్ మంజూరుకు కఠిన నియమాలు
360 డిగ్రీల కోణంలో దరఖాస్తుల పరిశీలన
సమగ్ర విచారణ తర్వాతే లబ్ధిదారుల ఎంపిక
మొదలైన దరఖాస్తుల ఆన్‌లైన్ నమోదు


