సీటుంది.. వసతి లేదు! | - | Sakshi
Sakshi News home page

సీటుంది.. వసతి లేదు!

Aug 19 2026 1:30 AM | Updated on Aug 19 2026 1:30 AM

ప్రత్యామ్నాయం ఏదీ?

కొత్త హాస్టళ్ల నిర్మాణం కొనసాగుతున్న నేపథ్యంలో అవి పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయ వసతి కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు. గతంలో కస్తూర్బాగాంధీ పాఠశాలను హాస్టల్‌గా వినియోగించిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ప్రస్తుతం పీయూ గెస్టుహౌస్‌తోపాటు పరిసరాల్లో కొన్ని ప్రభుత్వ భవనాలు ఖాళీగా ఉన్నా.. వాటిని ప్రత్యామ్నాయంగా వినియోగించేందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రైవేట్‌ వసతులకు నెలకు రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు ఖర్చవుతోందని చెబుతున్నారు.

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పీయూలో సీటు సాధించాలన్న విద్యార్థుల కల.. హాస్టల్‌ వసతి లేక చెదిరిపోతోంది. ఎప్‌సెట్‌, లాసెట్‌ వంటి ప్రవేశ పరీక్షల్లో సీట్లు సాధించినా.. వసతి సౌకర్యం లేక పలువురు అడ్మిషన్లు రద్దు చేసుకుంటున్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి విద్యార్థులు ప్రైవేట్‌ హాస్టళ్లు, రూముల్లో ఉండేందుకు నెలకు రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు వెచ్చించాల్సి వస్తుండటంతో వెనకడుగు వేస్తున్నారు. ఈ కారణంగానే లా, ఇంజినీరింగ్‌లో రెండు సంవత్సరాలుగా 159 సీట్లు ఖాళీగా మిగిలినట్లు తెలుస్తోంది. మరోవైపు ఉన్న హాస్టళ్లలోనూ సామర్థ్యానికి మించి విద్యార్థులు ఉంటుండటంతో సమస్య మరింత తీవ్రమవుతోంది.

లా, ఇంజినీరింగ్‌లో ఖాళీలు

లా కళాశాలలో గతేడాది ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో 140 సీట్లకు 97 మంది చేరగా.. 43 మంది సీట్లు రద్దు చేసుకున్నారు. ఈ ఏడాది ఎల్‌ఎల్‌బీలో 120 సీట్లకు 67 మంది చేరగా.. 53 సీట్లు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి ఈ నెల 19, 20 తేదీల్లో మరోసారి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు.ఇంజినీరింగ్‌లో 180 సీట్లకు 125 మంది చేరగా.. 55 సీట్లు మిగిలాయి. ఇందులో కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌లో 23, డేటా సైన్స్‌లో 35, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌–మెషిన్‌ లెర్నింగ్‌లో 5 సీట్లు ఉన్నాయి. హాస్టల్‌ వసతి లేకపోవడంతో ముఖ్యంగా బాలికలు సీట్లు వదులుకున్నట్లు తెలుస్తోంది. ఖాళీల భర్తీకి స్పాట్‌ అడ్మిషన్లకు అధికారులు నోటిఫికేషన్‌ ఇచ్చారు. అయితే వీటిలో చేరే వారికి ప్రభుత్వ స్కాలర్‌షిప్‌ అందే అవకాశం లేదని విద్యార్థులు చెబుతున్నారు.

680 మంది సామర్థ్యం.. 870 మంది

పీయూలో హాస్టల్‌ సమస్యతో విద్యార్థుల వెనకడుగు

లా, ఇంజినీరింగ్‌లో 159 సీట్లు ఖాళీ.. ఏటా ఇదే పరిస్థితి

ప్రైవేట్‌ హాస్టళ్లు, రూములకు నెలకు రూ.6–8 వేల భారం

కొత్త హాస్టళ్లు నిర్మాణంలో.. అప్పటివరకు అవస్థలే!

బాలికల హాస్టల్‌లో 680 మందికి వసతి కల్పించే సామర్థ్యం ఉండగా.. ప్రస్తుతం సుమారు 870 మంది ఉంటున్నట్లు సమాచారం. సామర్థ్యానికి మించి 190 మందికిపైగా ఉండటంతో గదుల్లోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నలుగురు ఉండాల్సిన గదుల్లో ఆరు నుంచి ఏడుగురు వరకు ఉంటున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement