నేటి నుంచి నోటీసుల జారీ
● సెప్టెంబర్ 16 వరకు ఓటర్ల నుంచి క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ
● అక్టోబర్ 15వరకు పరిష్కారం.. 19న తుది జాబితా విడుదల
అచ్చంపేట: ఎస్‌ఐఆర్ ప్రక్రియ మొదటి దశ ముగిసింది. బుధవారం నుంచి నియోజకవర్గాల ఎలక్ట్రోరల్ అధికారులు(ఈఆర్వోలు) నోటీసులు జారీచేసే ప్రక్రియతో రెండో దశ మొదలుకానుంది. నోటీసులు అందుకున్న ఓటర్లు ఫారం–6 ద్వారా ఎన్నికల సంఘం సూచించిన పత్రాలను అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. బీఎల్‌ఓలు క్షేత్రస్థాయిలో పరిశీలించి.. సరిగ్గా ఉంటే తిరిగి వారి పేర్లను జాబితాలో నమోదు చేయనున్నారు. ముసాయిదా జాబితాపై సెప్టెంబర్ 16 వరకు వచ్చే అభ్యంతరాలు, క్లెయిమ్స్‌ను పరిశీలించి.. అర్హత ఉన్నవారి వివరాలను సరిచేయనున్నారు. అక్టోబర్ 19న వెలువడే తుది జాబితాలో అసలు ఓటర్లు ఎంత మంది అనేది స్పష్టత రానుంది.
ఆధారాలు చూపిస్తేనే ఓటు హక్కు..
క్షేత్రస్థాయిలో బీఎల్‌ఓలు ఈఆర్వోలు ఇచ్చిన నోటీసులు జారీచేసే ప్రక్రియ చేపడుతారు. పోలింగ్ కేంద్రాల వారీగా నోటీసులు అందించి.. అర్హత నిరూపించుకోవడానికి ఇచ్చిన గడువు, విచారణకు హాజరు కావాల్సిన తేదీలతో కూడిన పత్రాలను పంపిణీ చేస్తారు. నోటీసులు అందుకున్న ఓటర్ల నుంచి ధ్రువపత్రాలను స్వీకరిస్తారు. 2002కు ముందు ఓటు హక్కు లేని వారు, తండ్రి వయసుతో సరికాని వారు, చిరునామా సక్రమంగా లేనివారు, తండ్రి, అన్నదమ్ముల మధ్య వయసు తేడా ఉన్నవారు అధారాలు చూపిస్తే ఓటు హక్కును పునరుద్ధరించనున్నారు.
రంగంలోకి రాజకీయ పార్టీలు..
మరణించిన వారు, గుర్తించలేని/గైర్హాజరైన వారు, శాశ్వతంగా వలస వెళ్లినవారు, ఇప్పటికే మరోచోట నమోదైన వారు, ఇతర కేటగిరీలు ఏఎస్‌డీడీలో ఉన్నాయి. ప్రస్తుతం రాజకీయ పార్టీలు ఈ అంశాలపై ప్రధానంగా దృష్టిసారించే అవకాశం ఉంది. తమ బూత్‌లో తొలగించిన ఓటర్ల జాబితాను తీసుకోవడం.. నిజంగా అక్కడే నివసిస్తున్న ఓటర్ల పేర్ల తొలగిపోయాయా? అనే దానిపై ఇంటింటికి వెళ్లి ప రిశీలించడం.. అర్హులైన కొత్త ఓటర్ల నమోదు, ము సాయిదా జాబితాలో తప్పులపై క్లెయిమ్స్, అభ్యంతరాలు దాఖలు చేయడం కీలకంగా మారింది.
జిల్లాలో మొత్తం ఓటర్లు 9,76,987
అనామలిస్ 1,65,552
అన్‌మ్యాప్డ్ ఓటర్లు 15,563
ప్రతి ఓటరు పరిశీలించుకోవాలి
అర్హత కలిగిన ప్రతి ఓటరు జాబితాలో తమ పేరు, వివరాలు తప్పనిసరిగా పరిశీలించుకోవాలి. ముసాయిదా జాబితాలో పేరులేని అర్హత కలిగిన వ్యక్తులు, ఓటరు వివరాల్లో మార్పులు, సవరణలు కోరుకునే వారు నిర్ణీత గడువులోగా క్లైయిమ్స్, అభ్యంతరాలు లేదా సవరణకు దరఖాస్తు చేసుకోవాలి. నిబంధనల ప్రకారం క్లైయిమ్స్, అభ్యంతరాలు పరిశీలించి తుది ఓటరు జాబితా రూపొందిస్తాం.
– హేమంత కేశవ్ పాటిల్, కలెక్టర్


