కందనూలు: ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎంపీ మల్లురవి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టే పౌరహక్కుల రక్షణ చట్టం, అట్రాసిటీ నివారణ చట్టాలను కచ్చితంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను సంబంధిత శాఖల సమన్వయంతో తక్షణమే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. ఎఫ్‌ఐఆర్ నమోదైన వెంటనే విచారణ దశలో ఉన్న బాధితులకు నిబంధనల మేరకు నష్టపరిహారం అందించాలని చెప్పారు. విజిలెన్స్, మానిటరింగ్‌కు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, భద్రతకు జిల్లా యంత్రాంగం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీ పౌర హక్కుల పరిరక్షణ చట్టం–1955, ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం–1989 ప్రకారం నమోదయ్యే ప్రతి కేసును జిల్లాస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. బాధితులకు ప్రభుత్వం అందించే పరిహారం, పునరావాసం, ఇతర సంక్షేమ సదుపాయాలు సకాలంలో అందేలా అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్ కమిటీకి సమగ్ర నివేదిక సమర్పించిన అనంతరం మాట్లాడారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీలపై జరిగే దాడులు, అత్యాచారాలు, వివక్షకు సంబంధించిన కేసుల పరిష్కారానికి పోలీసు యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తుందన్నారు. బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడమే ప్రధాన లక్ష్యంగా ప్రతి కేసును సున్నితంగా, పారదర్శకంగా విచారిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు లేకుండా చూడాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో కేసులు నమోదైన వెంటనే త్వరితగతిన దర్యాప్తు ప్రారంభించి వీలైనంత త్వర గా పూర్తి చేయాలని సూచించారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల భద్రత విషయంలో రాజీ పడకూదన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అరుణారెడ్డి పాల్గొన్నారు.


