వెట్‌రన్‌కు అడుగులు | - | Sakshi
Sakshi News home page

వెట్‌రన్‌కు అడుగులు

Jul 13 2026 1:28 AM | Updated on Jul 13 2026 1:28 AM

‘పాలమూరు’లోని మొదటి పంపును పరీక్షించిన అధికారులు

నేడు ఎల్లూరు పంపుహౌజ్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు

నాలుగు మోటార్లతో నీటిని ఎత్తిపోసేందుకు చర్యలు

సీఎం ఆదేశాలతో వేగం పుంజుకున్న పనులు

మరోవైపు..

ఇంకా అసంపూర్తిగానే కాల్వలు

కొల్లాపూర్‌: పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు మొదటి పంప్‌హౌజ్‌లో నీటి ఎత్తిపోతలకు అధికారులు ఎట్టకేలకు చర్యలు చేపట్టారు. ఇందుకోసం ఆదివారం రాత్రి మొదటి పంప్‌హౌజ్‌ను పరిశీలించి సోమవారం వెట్‌రన్‌ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. 2023 సెప్టెంబర్‌ 3న అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో నీటిపారుదల శాఖ అధికారులు మొదటి పంపు డ్రైరన్‌ చేపట్టగా.. పంపు మోటార్‌ పరీక్ష విజయవంతం కావడంతో అదే నెల 16న అధికారికంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలమూరు ప్రాజెక్టు ను ప్రారంభించారు. దాదాపు నాలుగు గంటలపాటు మొదటి పంపు ద్వారా 250 క్యూసెక్కుల నీటిని నార్లాపూర్‌ రిజర్వాయర్‌లోకి ఎత్తిపోశారు. కొన్నిరోజుల తర్వాత మరోసారి ఎత్తిపోతలు చేపట్టి, మొత్తం 2 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. తర్వాత వేర్వేరు కారణాలతో నీటి ఎత్తిపోతలు ఆగిపోగా.. మళ్లీ ఇన్నాళ్లకు నీటి పంపింగ్‌కు చర్యలు మొదలయ్యాయి.

ఒక్కో మోటార్‌ సామర్థ్యం

145 మెగావాట్లు

ఇప్పటి వరకు ఏర్పాటు చేసినవి 4

పాలమూరు పంప్‌హౌజ్‌లో ఏర్పాటు చేయాల్సిన మోటార్లు 8

నార్లాపూర్‌ రిజర్వాయర్‌ నీటినిల్వ సామర్థ్యం 6.04 టీఎంసీలు

ఒక మోటార్‌ ద్వారా రోజూ ఎత్తిపోసే నీళ్లు 3,000 క్యూసెక్కులు

రాజకీయ దుమారం..

గత మే, జూన్‌ నెలల్లో పాలమూరు ప్రాజెక్టు పనుల గురించి కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతల మధ్య మాటల యుద్ధం సాగింది. పాలమూరు ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్‌ఎస్‌ ఆరోపించింది. ఆ పార్టీకి చెందిన మాజీమంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యేలు పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. దీనికి కౌంటర్‌గా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి ప్రాజెక్టును సందర్శించి.. బీఆర్‌ఎస్‌ వల్లే ప్రాజెక్టు అసంపూర్తిగా మిగిలిపోయిందని ప్రత్యారోపణలు చేశారు. బీఆర్‌ఎస్‌కు రాజకీయంగా ఎలాంటి అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఏకంగా సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. గత జూన్‌ 4, 5 తేదీలలో క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రాజెక్టును సందర్శించారు. ఈ క్రమంలోనే వచ్చే డిసెంబర్‌ కల్లా ప్రాజెక్టును పూర్తి చేసి.. 90 టీఎంసీల నీటిని ఎత్తిపోసుకునేలా అనుమతులు తీసుకువస్తామని ప్రకటించారు.

తాజాగా

సీఎం ఆదేశాలతో..

సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశానుసారం పాలమూరు ప్రాజెక్టు పనుల్లో అధికారులు వేగం పెంచారు. ఈ నెలలోనే కచ్చితంగా ఎల్లూరు పంపుహౌజ్‌లోని నాలుగు మోటార్ల ద్వారా ఎత్తిపోతలు చేపట్టాలనే పట్టుదలతో శ్రమిస్తున్నారు. సోమవారం చేపట్టే వెట్‌రన్‌ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగితే మొదటి పంపు ద్వారా నీటి ఎత్తిపోతలు జరుగుతాయి. మిగతా మూడు మోటార్లకు వెంటనే డ్రైరన్‌ పూర్తిచేసేలా అధికారులు కృషిచేస్తున్నారు. ప్రాజెక్టులోని మోటార్ల ద్వారా నీటి ఎత్తిపోతలు చేపట్టి నార్లాపూర్‌ రిజర్వాయర్‌ను నింపుతామని, కాల్వల తవ్వకాలు పూర్తయిన వెంటనే నీటిని ఏదులకు.. అక్కడి నుంచి వట్టెం, కర్వెన రిజర్వాయర్లకు తరలిస్తామని అధికారులు తెలిపారు.

అసంపూర్తి పనులతో..

2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రాజెక్టు ప్రారంభమైనప్పటికీ అసంపూర్తి పనుల కారణంగా నీటి ఎత్తిపోతలు జరగలేదు. ఎల్లూరు పంప్‌హౌజ్‌ అవసరాలకు సరిపడా విద్యుత్‌ సరఫరా పనులు సుదీర్ఘకాలం కొనసాగి.. ఇటీవలే పూర్తయ్యాయి. అలాగే నార్లాపూర్‌ రిజర్వాయర్‌ నుంచి ఏదుల రిజర్వాయర్‌కు నీటిని తరలించే ప్రధాన కాల్వ తవ్వకాలు 2 కి.మీ., మేర కుడికిళ్ల, తిర్నాంపల్లి గ్రామాల సమీపంలో ఆగిపోయాయి. ఈ కాల్వ తవ్వకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్ల అదనపు నిధులు మంజూరు చేసినా.. పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. ఫలితంగా నార్లాపూర్‌ రిజర్వాయర్‌ను నింపినా ఏదులకు తరలించేందుకు మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement