వంగూరు: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమించి.. నిరంకుశ పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఏర్పడిందని అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జె.వెంకటేశ్ అన్నారు. వంగూరులో ఆదివారం సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి రాజకీయ శిక్షణ తరగతులకు వారు హాజరై మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కులాలు, మతాల పేరుతో ప్రజలను విభజించి పాలన సాగిస్తోందని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. కార్పొరేట్ పెట్టుబడి దారులకు కొమ్ముకాస్తూ.. కార్మికులను శ్రమ దోపిడీ చేస్తున్నారని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి.. నేడు యువత జీవితాల్లో మట్టికొడుతున్నారని వారు విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై సీపీఎం ఆధ్వర్యంలో దశలవారీ పోరాటాలను కొనసాగించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు, కార్యదర్శివర్గ సభ్యులు శ్రీనివాసులు, దేశ్యానాయక్, ఆంజనేయులు పాల్గొన్నారు.


