కందనూలు: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బాలుర కళాశాలలో ఈ నెల 14న వృత్తివిద్య కోర్సుల అప్రెంటిస్‌షిప్ మేళా నిర్వహించనున్నట్లు డీఐఈఓ వెంకటరమణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒకేషనల్ కోర్సుల్లో ఉత్తీర్ణత పొందిన జిల్లా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆసక్తిగల విద్యార్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు, మూడు సెట్ల జిరాక్స్ కాపీలు, 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకెళ్లాలని సూచించారు. మరిన్ని వివరాలకు 94929 92047 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.
జిల్లాకు మల్టీపర్పస్ ఆడిటోరియం మంజూరు
కందనూలు: జిల్లాకేంద్రంలో అత్యాధునిక మల్టీపర్పస్ ఆడిటోరియం నిర్మాణానికి రూ. 3కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానికంగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, ఇతర సమావేశాలకు సరైన వేదిక లేక ప్రజలు, అధికారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి.. మల్టీపర్పస్ ఆడిటోరియం మంజూరు చేయాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కోరగా.. సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. మల్టీపర్పస్ ఆడిటోరియం అందుబాటులోకి వస్తే నియోజకవర్గ ప్రజలు, అధికారులు, సాంస్కృతిక కళాకారులకు చక్కటి వేదిక లభిస్తుందన్నారు. తమ అవసరాన్ని గుర్తించి నిధులు మంజూరుచేసిన మంత్రి జూపల్లికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
రేపు కళాశాలల బంద్
కందనూలు: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌చేస్తూ ఈ నెల 14వ ఏబీవీపీ ఆధ్వర్యంలో కళాశాలల బంద్ చేపడుతున్నట్లు జిల్లా కన్వీనర్ శాంతన్ తెలిపారు. ఆదివారం జిల్లాకేంద్రంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు రూ. 11,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో లక్షలాది పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం నిధులను సకాలంలో విడుదల చేయకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులపై ఫీజుల పేరుతో ఒత్తిడి తీసుకొస్తున్నాయని.. పరీక్షలకు అనుమతించకపోవడం, సర్టిఫికెట్లు నిలిపివేయడం వంటి ఘటనలకు పాల్పడుతున్నాయన్నారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు చదువు కొనసాగించలేని పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని.. విద్యార్థుల భవిష్యత్‌ను ప్రభావితం చేసే అంశాలపై ప్రభుత్వం స్పందించకపోవడం ఆందోళనకరమని అన్నారు. ఈ నేపథ్యంలోనే 14న రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల బంద్‌కు పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బంగారు బాబు, నగర కార్యదర్శి ప్రసాద్, సంయుక్త కార్యదర్శి శివ, జీవన్, విష్ణు, శివ ఉన్నారు.
నేడు మంత్రుల పర్యటన
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ఉమ్మడి జిల్లాలో సోమవారం ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించనున్నారు. ఈ మేరకు రూ.1,775.51 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న రహదారుల విస్తరణ, మరమ్మతు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) ఫేజ్–1 కింద చేపట్టనున్న నాలుగు ప్యాకేజీల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 9 గంటలకు నారాయణపేట జిల్లా మక్తల్‌లో రూ.573 కోట్లతో మహబూబ్‌నగర్–1 ప్యాకేజీ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం గద్వాల జిల్లా ధరూర్ మండలంలోని గద్వాల– రాయచూర్ రహదారిపై రూ.339.39 కోట్లతో మహబూబ్‌నగర్–2 ప్యాకేజీ పనులకు భూమిపూజ చేయనున్నారు. మధ్యాహ్నం వనపర్తిలోని జడ్చర్ల రోడ్డులో రూ.359.09 కోట్లతో వనపర్తి–2 ప్యాకేజీ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఎల్లూరు వద్ద కొల్లాపూర్– మొలచింతలపల్లి మార్గంలో రూ.504.03 కోట్లతో వనపర్తి–1 ప్యాకేజీ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.
– వివరాలు 9లో..
బీటీరోడ్లు పూర్తయ్యేనా?
ఏడాదిగా నత్తనడకన సాగుతున్న పనులు
నిర్మాణాల పూర్తిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్లు


