నేటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు
● జిల్లాలో 60 పరీక్ష కేంద్రాల ఏర్పాటు
● హాజరుకానున్న 10,683 మంది విద్యార్థులు
● అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు
జిల్లా కేంద్రంలోని సీఎన్‌ఆర్ పాఠశాల పరీక్ష కేంద్రంలో హాల్ టికెట్ నంబర్లు వేస్తున్న సిబ్బంది
అచ్చంపేట/కందనూలు/కల్వకుర్తి టౌన్: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. శనివారం నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు జరిగే పరీక్షలకు ఇప్పటికే విద్యార్థులను అన్నివిధాలా సంసిద్ధం చేశారు. జిల్లాలో పరీక్షల నిర్వహణ కోసం 60 కేంద్రాలను ఏర్పాటుచేయగా.. 10,683 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో 5,264 మంది బాలురు, 5,394 మంది బాలికలు ఉన్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలను తేలికగా తెలుసుకునేందుకు గాను హాల్ టికెట్‌పై క్యూఆర్ కోడ్ ముద్రించారు. మీసేవ కేంద్రం లేదా 80969 58096 వాట్సప్ నంబర్ ద్వారా కూడా హాల్ టికెట్ పొందే వెసులుబాటు కల్పించారు. పరీక్షల పర్యవేక్షణ కోసం 60 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 60 మంది డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు, ఇద్దరు అడిషనల్ డిపార్డ్‌మెంట్ ఆఫీసర్లు, 4 ఫ్లయింగ్ స్క్వాడ్, 6 సిట్టింగ్ స్క్వాడ్స్, 36 మంది కస్టోడియన్స్, 517 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహించనున్నారు.
పదో తరగతి పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎండలు తీవ్రం కావడంతో కేంద్రాల వద్ద వైద్య సదుపాయాలు, తాగునీటి వసతి ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి గదిలో ఫ్యాన్, ఫర్నిచర్ ఏర్పాటు చేశారు. ఎలాంటి మాస్ కాపీయింగ్‌కు తావు లేకుండా పోలీస్, రెవెన్యూ, విద్యాశాఖ అధికారులు పర్యవేక్షించనున్నారు.
అన్ని వసతుల ఏర్పాటు..
నిపుణుల సూచనలు..
పరీక్షలు రాసే విద్యార్థులు ప్రశాంతంగా చదవడం ద్వారా అన్ని విషయాలు గుర్తుకు ఉంటాయి. గతంలో చదివిన వాటిని రివిజన్ చేయాలి కానీ.. కొత్తగా మరిన్ని విషయాలను చదివి కంగారు పడొద్దు.
గతంలో తమ పాఠశాలలోనే పరీక్షలు రాసిన విద్యార్థులు ఇప్పుడు ఇతర పరీక్ష కేంద్రంలో పరీక్షలు రాయడానికి వెళ్తారు. ఈ క్రమంలో కొంత ఇబ్బందులు పడతారు. అనుకున్న మార్కులు వస్తాయో రావోనన్న భ యం కలుగుతుంది. ముందుగా విద్యార్థులు ఆ భయాన్ని వీడి పరీక్షలకు హాజరుకావాలి.
ఏ అంశం నుంచి ప్రశ్నలు వచ్చినా రాస్తామనే ధీమా.. నమ్మకంతో ఉంటూ ఆందోళనను దూరం చేసుకోవాలి.
పరీక్ష కేంద్రానికి నిర్ణీత సమయానికి ముందుగానే చేరుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండవచ్చు. కనీసం గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలే తప్ప.. చివరి నిమిషంలో హడావుడిగా కేంద్రానికి వెళ్లడం వల్ల ఒత్తిడి పెరిగి పరీక్ష సరిగ్గా రాయలేకపోతారు.
ప్రశ్నపత్రం చేతికి రాగానే కంగారు పడకుండా.. సుమారు 10 నిమిషాలు చదివితేనే పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. ప్రశ్నపత్రం చదివాక ముందుగా తెలిసిన వాటికి సమాధానాలు రాస్తే పరీక్షపై నమ్మకం వచ్చి.. మిగిలిన వాటికి సైతం మంచి జవాబులను రాసేందుకు ఆస్కారం ఉంటుంది.
పరీక్షల సమయంలో చాలా మంది విద్యార్థులు ఒత్తిడికి గురై ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం పరిపాటిగా మారుతుంది. ఈ సమయంలో పోషకాహారం, పండ్లు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ లాంటివి తీసుకుంటే శరీరం పూర్తిగా రీచార్జ్ అవుతుంది. రాత్రిపూట కనీసం 6 గంటలకు పైగా నిద్ర తప్పనిసరి. పరీక్ష అనేది మీ మేధస్సుకు ఒక పరీక్ష మాత్రమే కానీ మీ జీవితానికి కాదు. ఆత్మస్థైర్యంతో ముందడుగు వేస్తే ప్రతి విద్యార్థి మంచి ఫలితాలు సాధించవచ్చు.


