‘విద్యా కమిషన్‌ సిఫారసులు సవరించాలి’ | - | Sakshi
Sakshi News home page

‘విద్యా కమిషన్‌ సిఫారసులు సవరించాలి’

Mar 4 2026 8:41 AM | Updated on Mar 4 2026 8:41 AM

కందనూలు: ప్రభుత్వానికి విద్యా కమిషన్‌ సమర్పించిన సిఫారసులను సవరించి.. అసంబద్ధ అంశాలను తొలగించాలని జిల్లా టీచర్స్‌ జేఏసీ డిమాండ్‌ చేసింది. మంగళవారం స్థానిక జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో జేఏసీ చైర్మన్‌ సత్యనారాయణరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి జిల్లాలోని పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు హాజరై మాట్లాడారు. విద్యా కమిషన్‌ రూపొందించిన ప్రతిపాదనల్లో కొన్ని అంశాలు ప్రభుత్వ విధానానికి ఉపయోగకరంగా ఉన్నప్పటికీ.. అనేక సూచనలు ఆచరణ సాధ్యంకానివిగా ఉన్నాయని ఆక్షేపించారు. మండలాన్ని యూనిట్‌గా తీసుకోవడం.. ఒక మండలంలో 3 లేదా 4 పాఠశాలలే ఉండాలనే ప్రతిపాదన గ్రామీణ విద్యార్థులను చదువుకు దూరం చేసే చర్యగా ఉందని అభిప్రాయపడ్డారు. విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని 45 శాతం నుంచి 75 శాతానికి పెంచే ప్రతిపాదన విద్యార్థులపై మానసిక ఒత్తిడిని పెంచి.. డ్రాపౌట్‌లు పెరిగే ప్రమాదం ఉందన్నారు. ఉపాధ్యాయ శిక్షణకు సంబంధించిన కొన్ని సూచనలు ఎన్‌సీటీఈ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. వివిధ ప్రవేశ పరీక్షలను రద్దు చేయడమంటే కార్పొరేట్‌ విద్యా వ్యవస్థకు ఊతమిచ్చే చర్య అని అభివర్ణించారు. ఒకే క్యాంపస్‌లో 1,500 మందికి పైగా విద్యార్థులతో పాఠశాలలు నిర్వహించడం ఆచరణ సాధ్యం కాదన్నారు. ఉపాధ్యాయులను ఐదేళ్ల కాంట్రాక్ట్‌ పద్ధతిలో నియమించి.. ఆ తర్వాత పనితీరు ఆధారంగా కొనసాగింపు ఇవ్వాలనే ప్రతిపాదన అన్యాయమని విమర్శించారు. ఉపాధ్యాయుల వేతనాలు అధికంగా ఉన్నాయని.. వాటిని తగ్గించాలని సూచించడం సరైంది కాదన్నారు. పేద విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రద్దు చేయాలనే ప్రతిపాదన అన్యాయమన్నారు. విద్యా కమిషన్‌ అసంబద్ధ సిఫారసులను తొలగించి.. విద్యార్థుల ఆకాంక్షకు అనుగుణంగా విధానాలను రూపొందించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో జేఏసీ నాయకులు శ్రీధర్‌ శర్మ, విజయ్‌కుమార్‌, రాజారెడ్డి, గుడిపల్లి నిరంజన్‌, లక్ష్మణ్‌ నాయక్‌, సీహెచ్‌ వెంకట్‌, పచ్చిపాల సుబ్బయ్య, ఆంజనేయులు, రమేశ్‌, కొంగరి జానయ్య ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement