సాగుదాం.. కొత్త ఆశలతో.. | - | Sakshi
Sakshi News home page

సాగుదాం.. కొత్త ఆశలతో..

Jan 1 2026 1:52 PM | Updated on Jan 1 2026 1:52 PM

సాగుదాం.. కొత్త ఆశలతో..

సాగుదాం.. కొత్త ఆశలతో..

నూతన సంవత్సరంలో మార్పు కోసం నిర్ణయాలు

జీవన శైలిలో మార్పులు, ఆరోగ్యంపై దృష్టి

సెల్‌ఫోన్‌, స్క్రీన్‌ టైం తగ్గిస్తాం..

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులతో ‘సాక్షి’ టాక్‌షో

సాక్షి, నాగర్‌కర్నూల్‌: ‘కొత్త ఏడాదిలో తమను తాము నూతనంగా పరిచయం చేసుకుంటాం. అనుకున్న లక్ష్యాలను సాధించి తల్లిదండ్రులకు, గురువులకు పేరు తెచ్చేందుకు అహర్నిశలు కృషి చేస్తాం. సంపూర్ణ ఆరోగ్యం సాధించేందుకు అవసరమైన మానసిక, శారీరక ధృడత్వాన్ని పెంచుకుంటాం. ఇకపై తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో వీలైనంత ఎక్కువ సేపు గడిపేస్తాం. సెల్‌ఫోన్‌, సోషల్‌మీడియాను కాలక్షేపం కోసం కాకుండా భవిష్యత్‌ను నిర్మించుకునేందుకు వినియోగిస్తాం’ అని జిల్లాకేంద్రంలోని డిగ్రీ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులు తెలిపారు. 2026 కొత్త ఏడాదిలో తీసుకోనున్న నిర్ణయాలు, కోరుకుంటున్న మార్పులపై నెల్లికొండ చౌరస్తాలోని ప్రభుత్వ డిగ్రీ, పీజీ సైన్స్‌ కళాశాల విద్యార్థులతో బుధవారం ‘సాక్షి’ టాక్‌షోను నిర్వహించింది. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

పునరావృతం కానివ్వను

గతంలో ఏమైనా తప్పులు చేసుంటే వాటిని కొత్త ఏడాదిలో పునరావృతం కాకుండా చూసుకుంటా. ఎప్పటికప్పుడు మెరుగయ్యేందుకు ప్రయత్నిస్తాను. చదువుపై దృష్టిపెట్టి రోజువారీగా చదువుకు సమయం కేటాయిస్తాను.

– తోజాక్షి, ఎల్లూరు, డిగ్రీ మొదటి సంవత్సరం

పనులు వాయిదా వేయను..

కొత్త సంవత్సరంలో పనులను వాయిదా వేయకుండా ఎప్పటికప్పుడు పూర్తిచేసేలా చూసుకుంటా. చదువుపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలు నిర్ధేశించుకుంటా.

– కావ్య,

చందుబట్ల, డిగ్రీ మొదటిసంవత్సరం)

చదువుపైనే దృష్టి..

ఈ ఏడాదిలో పూర్తిగా చదువుపైనే దృష్టి పెడతా. క్లిష్టమైన సబ్జెక్టులకు ఎక్కువ సమయం కేటాయించి పట్టు సాధిస్తా. ప్రశాంతంగా ఉండేందుకే ప్రయత్నిస్తాను.

– గ్రీష్మచంద్రిక, శానాయిపల్లి, డిగ్రీ మొదటి సంవత్సరం

నైపుణ్యం పెంచుకుంటా..

చదువుపై నిరంతరం దృష్టి సారిస్తూనే భవిష్యత్‌లో ఉద్యోగాలకు అవసరమయ్యే నైపుణ్యాన్ని నేర్చుకుంటాను. చదువుతో పాటు ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ పెంచుకుంటాను.

– మౌనిక, గన్యాగుల, డిగ్రీ మొదటి సంవత్సరం

ఉద్యోగం కోసం..

డిగ్రీలోని సబ్జెక్టులపై దృష్టి పెడుతూనే.. కొత్త సంవత్సరంలో ఉద్యోగం సాధించేందుకు కావాల్సిన విషయాలపై దృష్టి సారిస్తా. పోటీ పరీక్షలో రాణించేందుకు శిక్షణ తీసుకుంటాను.

– చైతన్య,

నాగాపూర్‌, డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌

స్క్రీన్‌ టైం తగ్గిస్తా..

కొత్త సంవత్సరంలో మొబైల్‌, సోషల్‌మీడియా వినియోగాన్ని తగ్గించుకుంటా. ఆ సమయాన్ని పుస్తకాలు చదివేందుకు కేటాయిస్తా. రీల్స్‌ చూస్తు సమయం వృథా చేసుకోకుండా నైపుణ్యం పెంచుకునేందుకు ఇంటర్నెట్‌ను వినియోగిస్తా.

– అనిత, కుమ్మెర, డిగ్రీ రెండో సంవత్సరం

ఫిట్‌నెస్‌పై దృష్టి

కొత్త ఏడాదిలో పూర్తిగా ఆరోగ్యంపై దృష్టి సారిస్తా. ఫిట్‌నెస్‌ సాధించేందుకు రోజూవారీగా సమయం కేటాయిస్తాను. స్నేహితులు, కుటుంబంతో కలిసి ఉండేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తా.

– అబ్దుల్‌ టర్బ్‌,

బిజినేపల్లి, డిగ్రీ మొదటి సంవత్సరం

జీవనశైలిలో మార్పు కావాలి

కొత్త సంవత్సరంలో ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకుంటాను. పోషకాహారం తీసుకోవడంతో పాటు సరైన నిద్ర, సంతోషంగా ఉండేందుకు ప్రయత్నిస్తాను. గతంలో కన్నా మెరుగ్గా ఉండేందుకు పనిచేస్తాను. – శ్రీశైలం యాదవ్‌,

తెలకపల్లి, డిగ్రీ మొదటి సంవత్సరం

ఉత్తమ ఫలితాలు సాధిస్తా..

ఈ సంవత్సరం పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు, కాలేజీకి పేరు తీసుకొస్తా. ఇందుకోసం రోజూవారీగా సమయం కేటాయించి సిలబస్‌ పూర్తిచేస్తాను. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతాను.

– సుస్మిత, నాగర్‌కర్నూల్‌, డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌

లక్ష్యం వైపు అడుగులు..

ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది నా కల. ఇందుకోసం కొత్త సంవత్సరం ప్రారంభం నుంచే కసరత్తు ప్రారంభిస్తాను. రోజూవారీగా షెడ్యూల్‌ కేటాయించి లక్ష్యం వైపు ప్రయాణిస్తా. – రాఘవేంద్ర,

దేవల్‌తిరుమలాపూర్‌, డిగ్రీ ఫస్ట్‌ ఇయర్‌

ఒత్తిడిని తగ్గించుకుంటా..

ఈ ఏడాదిలో సమయపాలన పాటించేలా చూసుకుంటా. సమయానికి భోజనం, త్వరగా పడుకోవడం, నిద్ర కోసం తగినంత సమయం కేటాయించేలా చూసుకుంటాను. అన్ని సబ్జెక్టులకూ ప్రాధాన్యమిస్తూ పరీక్షల్లో ఒత్తిడిని తగ్గించుకుంటాను. – చందన,

తాడూరు, డిగ్రీ మొదటి సంవత్సరం

తల్లిదండ్రులతో ఎక్కువగా గడుపుతా

కొత్త ఏడాదిలో తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నిస్తాను. ఇంటి పనుల్లో అమ్మకు సాయంగా ఉంటాను. వారికి నచ్చేలా నడుచుకుంటాను. చదువుపై దృష్టిపెట్టి మెరుగైన ఫలితాలు సాధిస్తాను.

– భవాని, పెద్దాపూర్‌,

డిగ్రీ మొదటి సంవత్సరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement