‘పోలీసుల పనితీరు భేష్’
నాగర్‌కర్నూల్ క్రైం: 2025 సంవత్సరంలో జిల్లా పోలీసులు అన్ని విభాగాల్లో అద్భుతమైన పనితీరును కనబర్చి శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేశారని ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు, దైనందిన జీవితంలో ప్రజలకు సేవ చేయడంలో పోలీసులు ముందంజలో ఉన్నారని కొనియాడారు. 2024 సంవత్సరం కంటే 2025లో జిల్లాలో నేరాల సంఖ్య స్పల్వంగా పెరిగిందన్నారు. ఎస్పీ కార్యాలయంలో 2025 సంవత్సరానికి సంబంధించిన వార్షిక నేర నివేదికను బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. 2025లో 4,138 కేసులు నమోదు కాగా.. అందులో 28 హత్యలు, రాత్రి దొంగతనాలు 74 జరిగాయని, సాధారణ దొంగతనాలు 125 జరిగాయన్నారు. రూ.1.94 కోట్లు చోరీ జరగగా.. రూ.73.19 లక్షలు రికవరీ చేశామని తెలిపారు. 379 రోడ్డు ప్రమాదాలు జరగగా.. 184 మంది మృతి చెందడంతో పాటు 392 మంది గాయపడ్డారని తెలిపారు. మహిళలపై నేరాలు 2024 తో పోలిస్తే 20శాతం తగ్గి 337 నమోదయ్యాయని వెల్లడించారు. 57 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, 39 కిడ్నాప్, 54 రేప్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. 331 మిస్సింగ్ కేసుల్లో 275 ట్రేస్ చేశామన్నారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 240 మంది నిందితులను అరెస్టు చేసి 126 కేసులు నమోదు చేయడంతో పాటు 148 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. 1.9 కేజీల గంజాయి, 22గ్రాముల ఆల్ఫాజోలం స్వాధీనం చేసుకుని 32 మంది నిందితులను అరెస్టు చేసి 9 ఎన్‌డీపీసీ చట్టం కింద కేసులు నమోదు చేశామన్నారు. 2025లో 1,878 కేసులను కోర్టులు వివిధ పద్ధతుల ద్వారా పరిష్కరించాయని, అందులో 703 కేసుల్లో నేరాలు నిరూపితమయ్యాయని, 561 కేసుల్లో విచారణ జరుగుతుందని, 614 కేసులు రాజీ అయ్యాయని పేర్కొన్నారు. ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా 60 మంది బాలురు, ముగ్గురు బాలికలను రక్షించి తల్లిదండ్రులకు అప్పగించామని, బాలకార్మికుల చట్టం కింద 27 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. షీటీంకు సంబంధించి 138 పిటిషన్లు రాగా.. 30 కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌ల నమోదు చేయడంతో పాటు 101 కౌన్సిలింగ్ సెషన్లు నిర్వహించామని, 174 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ నోముల వెంకటేశ్వర్లు, డీఎస్పీలు బుర్రి శ్రీనివాస్, వెంకట్‌రెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు.
బాంబ్ స్వ్కాడ్ విస్తృత తనిఖీలు
నూతన సంవత్సర వేడకల్లో జిల్లాలో ఎక్కడా అవాంచనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా బాంబ్ డిస్పోసల్ టీంతో విస్తృత తనిఖీలు చేపట్టినట్లు ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్, ట్యాంక్‌బండ్, కలెక్టరేట్, ఆర్టీసీ బస్టాండ్‌తో పాటు పలు ప్రాంతాల్లో పోలీసుశాఖ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు.


