
విస్తరణ వేగవంతం
కల్వకుర్తి–నంద్యాల ఎన్‌హెచ్–167కే పనుల్లో పురోగతి
మారనున్న రూపురేఖలు..
ఇప్పటికే కల్వకుర్తి నుంచి తాడూరు వరకు నాలుగు వరుసల రహదారి పనులు పూర్తయ్యాయి. తాడూరు నుంచి నాగర్‌కర్నూల్ సమీపంలోని కొల్లాపూర్ చౌరస్తా వరకు పనులు పెండింగ్‌లో ఉండగా, నాగర్‌కర్నూల్ నుంచి పెద్దకొత్తపల్లి మీదుగా కొల్లాపూర్ వరకు విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. కొల్లాపూర్ సమీపంలోని సింగోటం చౌరస్తా నుంచి కృష్ణా తీరంలోని సోమశిల వరకు రహదారి నిర్మాణ పనుల్లో వేగం పెరిగింది. మరో ఆరు నెలల్లో పనులు పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. సోమశిల వద్ద ఐకానిక్ వంతెన నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతం కొత్తరూపు సంతరించుకోనుంది.
సాక్షి, నాగర్‌కర్నూల్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణతో ఆయా ప్రాంతాల రూపురేఖలు మారిపోనున్నాయి. ఇప్పటికే కొనసాగుతున్న కల్వకుర్తి–నంద్యాల జాతీయ రహదారి 167కే పనుల్లో వేగం పుంజుకుంది. కల్వకుర్తి మండలం కొట్ర చౌరస్తా నుంచి కొల్లాపూర్ వరకు వివిధ దశల్లో పనులు శరవేగంగా సాగుతున్నాయి. కల్వకుర్తి నుంచి నాగర్‌కర్నూల్ వరకు రహదారి విస్తరణ దాదాపు పూర్తి కావస్తుండగా, నాగర్‌కర్నూల్ నుంచి కొల్లాపూర్ మధ్యలో కొన్నిచోట్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయి. మండల కేంద్రాలు, గ్రామాల వద్ద రెయిలింగ్, పేవ్‌మెంట్లు, వంతెనల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి నాటికి రహదారి నిర్మాణం పూర్తి చేయాలనే సంకల్పంతో అధికారులు పనులు కొనసాగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో కల్వకుర్తి–నంద్యాల, జడ్చర్ల–కోదాడ, మహబూబ్‌నగర్ బైపాస్ జాతీయ రహదారుల నిర్మాణాలతో రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడనుంది.
ఐకానిక్ వంతెనకు టెండర్లు..
కల్వకుర్తి – నంద్యాల జాతీయ రహదారి 167కే పనుల్లో భాగంగా కొల్లాపూర్ సమీపంలోని సోమశిల వద్ద కృష్ణానదిపై ఐకానిక్ వంతెన నిర్మాణం చేపట్టాల్సిఉంది. ఈ వంతెన నిర్మాణానికి నెలరోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందని జాతీయ రహదారులశాఖ అధికారులు చెబుతు న్నారు. రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది.
11 కి.మీ. మేర మహబూబ్‌నగర్ బైపాస్..
మహబూబ్‌నగర్ బైపాస్ నిర్మాణానికి ఇటీవల కేంద్రం ఆమోదం తెలిపింది. మహబూబ్‌నగర్ శివారులోని అప్పన్నపల్లి వద్దనున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ) నుంచి హన్వాడ మండలం చిన్నదర్పల్లి మీదుగా చించోలి జాతీయ రహదారి వరకు అనుసంధానం చేసేందుకు బైపాస్ రహదారి నిర్మించనున్నారు. సుమారు 11 కి.మీ. మేర రహదారి నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభించనున్నారు.
జనవరి నాటికి
పూర్తిచేసేలా కార్యాచరణ
వచ్చే నెలలో సోమశిల వంతెన
నిర్మాణానికి టెండర్లు
రెండేళ్ల సమయం పట్టొచ్చని అంచనా

విస్తరణ వేగవంతం