
కార్యకర్తల సంకల్పం గొప్పది
● అచ్చంపేట పార్టీ శ్రేణులే
రాష్ట్రానికి ఆదర్శం ●
● మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
28న అచ్చంపేటలో కేటీఆర్ సభ
ఈ నెల 28న అచ్చంపేటలో కేటీఆర్ బహిరంగ సభ ఉంటుందని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని మండలాలు, గ్రామాల వారీగా కార్యకర్తలను కలుస్తామని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ కూటమిగా ఏర్పడి బీఆర్‌ఎస్ మీద దండయాత్ర చేస్తున్న సమయంలో గువ్వల పార్టీని వీడి కార్యకర్తలకు అన్యాయం చేశారని పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. బంగారు తెలంగాణగా మార్చిన కేసీఆర్‌ను చూసి పార్టీలోకి వచ్చానని.. నా మీద గువ్వల ఎందుకు నిందలు వేస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. కార్యక్రమంలో కల్వకుర్తి, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్ హర్షవర్ధన్‌రెడ్డి, సీనియర్ నాయకులు పోకల మనోహర్, అభిలాష్‌రావు, మాజీ మున్సిపల్ చైర్మన్లు కె.తులసీరాం, నర్సింహగౌడ్, మాజీ ఎంపీపీలు పర్వతాలు, కరుణాకర్‌రెడ్డి, కట్టా గోపాల్‌రెడ్డి, శ్రీకాంత్ భీమా, అమీనోద్దీన్, రమేష్‌రావు, అంతటి శివ తదితరులు పాల్గొన్నారు.
అచ్చంపేట: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్‌కు ఓట్లు వేయలేదని.. ఇచ్చిన మోసపూరిత హామీలను నమ్మి ఓట్లేసి ఇప్పుడు ఎంతో బాధపడుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్‌హాల్‌లో బీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గస్థాయి ఆత్మీయ సమ్మేళనం నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన జరగగా ఆయనతో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. కార్యకర్తలు కేసీఆర్‌కు అండగా ఉన్నారని, ఇందుకు నిదర్శనం అచ్చంపేటలో నాయకుడు వెళ్లిన తర్వాత జరిగిన పరిణామాలేనని తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలకు రెండునెలల ముందుగా ప్రాజెక్టులకు నీళ్లొచ్చినా.. రైతులకు సాగునీరు వదలకుండా సముద్రంలోకి వదిలారన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు సంఘటితంగా ఉండి పార్టీ అభ్యర్థులను అత్యధిక సంఖ్యలో గెలిపించుకొని సత్తా చాటుదామని పిలుపునిచ్చారు. నాయకుడు పార్టీ మారాలంటే భయపడే పరిస్థితిని అచ్చంపేట కార్యకర్తలు కల్పించారన్నారు.
హామీలు విస్మరించి అబద్ధాలతో పాలన..
రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. అధికారంలోకి వచ్చిన కొద్దికాలంలోనే అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత వారికే దక్కుతుందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ధ్వజమెత్తారు. విద్యుత్ కోతలు, భూములు, ప్లాట్ల ధరలు భారీగా పడిపోయావని.. అవసరానికి భూములు అమ్ముదామన్నా కొనలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు విస్మరించి.. అబద్దాలతో పాలన సాగిస్తోందని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీలు అమలు చేయమంటే కేసులతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. కరుడుగట్టిన కార్యకర్తల ఆదరణ ఉన్నా.. గువ్వల బాలరాజు లాంటి నాయకుడు పార్టీ మారడం అవివేకమని, ఓ రకంగా ఆయన పతనానికి ఆయనే కారణమయ్యారని తెలిపారు. మాజీ మంత్రి డా. లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. గువ్వల పార్టీ మారడం దురదృష్టకరమని, నాయకుడు కార్యకర్తలకు భరోసా కల్పించేలా ఉండాలన్నారు. రాష్ట్రంలో రానున్నది బీఆర్‌ఎస్ పాలనేనని.. కేసీఆర్ పాలనలో తెలంగాణ స్వర్ణయుగమన్నారు.