
ప్రజా ప్రభుత్వంలోనే సంక్షేమ పథకాలు
నాగర్‌కర్నూల్: సన్న బియ్యం పంపిణీ, ఉచిత విద్యుత్, రైతు భరోసా వంటి సంక్షేమ పథకాలను పేదలకు అందించడంలో ప్రస్తుత ప్రజా ప్రభుత్వం ముందుందని ఎమ్మెల్యే డా. రాజేష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ బదావత్ సంతోష్‌తో కలిసి నియోజకవర్గంలోని నాగర్‌కర్నూల్, తెలకపల్లి, తాడూర్, బిజినేపల్లి, తిమ్మాజీపేట మండలాల లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు అందజేసి మాట్లాడారు. దేశంలో పేదలకు సన్న బియ్యం పంపిణీ చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. జిల్లాలో అర్హులైన పేదలకు ఆహార భద్రత కల్పించి ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. అధికారంలోకి వచ్చిన 19 నెలల్లోనే జిల్లాకేంద్ర అభివృద్ధికి రూ.40 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. సన్న బియాన్ని కొందరు డీలర్లు అమ్ముకుంటున్నట్లు ఫిర్యాదు అందాయని.. అలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
● జిల్లాలోనే మొదటి ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశాన్ని శుక్రవారం తిమ్మాజీపేట మండలం ఇప్పలపల్లిలో నిర్వహించినట్లు చెప్పారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తమ పదేళ్ల పాలనలో పేదలకు రేషన్‌కార్డులు జారీ చేయకపోవడంతో సంక్షేమ పథకాలు అందలేదని, రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి పథకాలను వినియోగించుకోలేక పోయారన్నారు. అనంతరం కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో 6,600 మంది లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు వివరించారు. అలాగే పాత రేషన్ కార్డుల్లో అదనంగా 16 వేల మంది పేర్లను నమోదు చేశామన్నారు. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని.. మీ సేవా కేంద్రాల్లో నమోదు చేసుకుంటే వెంటనే రేషన్ కార్డును జారీ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి నరసింహారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, ఆర్డీఓ సురేష్‌బాబు, తహసీల్దార్లు తబితారాణి, జాకీర్ అలీ, మునీరుద్దీన్, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఐదు మండలాల లబ్ధిదారులు పాల్గొన్నారు.