అందని ‘ఆయుష్‌’! | - | Sakshi
Sakshi News home page

అందని ‘ఆయుష్‌’!

May 15 2025 12:14 AM | Updated on May 15 2025 3:37 PM

జిల్లాలో వేధిస్తోన్న వైద్యులు, సిబ్బంది కొరత 

మందుల సరఫరా సైతం అరకొరగానే..

నిరుపయోగంగా మారుతున్న వైద్యశాలలు

జిల్లా కేంద్రంలో ఆయుర్వేదిక్‌, హోమియో డిస్పెనర్సీల ఏర్పాటుకు డిమాండ్‌

నాగర్‌కర్నూల్‌ క్రైం: ఏ వ్యక్తికి అయినా ఆరోగ్య సమస్యలు ఎదురైతే దుష్ప్రభావాలు లేని చికిత్స చేయించుకునేందుకు ఇష్టపడతారు. ఎక్కువగా దేశీయ వైద్యం వైపు మొగ్గు చూపుతారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయుష్‌ వైద్యవిభాగానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటుచేసి.. రాష్ట్రాలకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయుష్‌కు తగిన ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ.. జిల్లాలో వైద్యులు, ఫార్మసిస్టులు, ఇతర సిబ్బంది కొరత, నామమాత్రంగా మందుల సరఫరాతో వైద్యసేవలు ఆశించిన స్థాయిలో అందడం లేదు.

యునాని వైద్యం మాత్రమే..

జిల్లా కేంద్రంలో యునాని వైద్యం మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంది. ఆయుర్వేద, హోమియో ఆస్పత్రులు అందుబాటులో లేకపోవడంతో సమీపంలోని వైద్యశాలలకు వెళ్లి వైద్యం పొందాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లా కేంద్రంలో ఆయుర్వేద, హోమియో ఆస్పత్రులు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ ప్రజలు కోరుతున్నా.. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అందుబాటులో ఏడుగురు వైద్యులు మాత్రమే..

ప్రభుత్వం ఆయుష్‌ విభాగానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ.. అందుకు తగిన వైద్యులు, సిబ్బందిని నియమించక పోవడంతో సరైన వైద్యం అందడం లేదనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలోని రెగ్యులర్‌ డిస్పెన్సరీల్లో వైద్యుల పోస్టులు ఖాళీగా ఉండటంతో పాటు చాలా మంది ఇతర ప్రాంతాలకు డిప్యూటేషన్‌లో వెళ్లిపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆయుష్‌ రెగ్యులర్‌ ఆస్పత్రులకు సంబంధించి ఏడుగురు వైద్యులు మాత్రమే అందుబాటులో ఉండగా.. మిగతా ఆస్పత్రుల్లో వైద్యులు లేక నిరుపయోగంగా మారాయి. కాగా, ఎన్‌ఆర్‌హెచ్‌ఎం కింద ఏర్పాటుచేసిన 15 ఆయుష్‌ వైద్యశాలల్లో వైద్యులు ఆయర్వేద చికిత్స అందించకుండా అలోపతి వైద్యం అందిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో ఖాళీగా ఉన్న ఆయుష్‌ ఆస్పత్రుల్లో వెంటనే వైద్యులను నియమించాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. గత కలెక్టర్‌ హయాంలో ఆయుర్వేదిక్‌లో పంచకర్మ ప్రారంభించాలనే ఆలోచనతో కొంత మెటీరియల్‌ కూడా సమకూర్చారు. అయినప్పటికీ సంబంధిత ఉన్నతాధికారుల నుంచి స్పందన లేకపోవడంతో నిరుపయోగం మారాయని పలువురు పేర్కొంటున్నారు.

అరకొరగా మందుల సరఫరా..

ఆయుర్వేదం, యునాని, హోమియోపై ప్రజల్లో అవగాహన పెరగడంతో.. దీర్ఘకాలిక రోగులే కాకుండా సాధారణ రోగులు సైతం దుష్ప్రభావాలు లేని ఆయుష్‌ వైద్యంపై ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా షుగర్‌, న్యూరోలాజికల్‌, శ్వాసకోశ, చర్మ, వాతం, గ్యాస్‌ ట్రబుల్‌, ఫైల్స్‌ తదితర వాటితో పాటు సీ్త్రలకు సంబంధించిన వ్యాధులకు ఆయుర్వేద వైద్యం పొందేందుకు మక్కువ చూపుతండటంతో వైద్యశాలల్లో ఓపీ సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయితే ప్రభుత్వం మందులను అరకొరగా సరఫరా చేస్తుండటంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రైవేటులో మందుల ఖరీదు అధికంగా ఉండటం.. తగినన్ని ఆయుర్వేద మందుల దుకాణాలు సైతం లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు.

జిల్లాలో సేవలు ఇలా..

జిల్లాలోని 19 చోట్ల ఆయుష్‌కు సంబంధించి రెగ్యులర్‌ డిస్పెన్సరీలు ఉండగా.. అందులో ఆయుర్వేద వైద్యశాలలు బిజినేపల్లి, చారకొండ, గొరిట, కార్వాంగ, కొండనాగుల, మన్ననూర్‌, సిద్దాపూర్‌, తాడూరు, తూడుకుర్తి, వెల్దండ, వెంకటేశ్వర్లబావి, ఎల్లికల్‌ గ్రామాల్లో కొనసాగుతున్నాయి. యునాని వైద్యానికి సంబంధించి అంబటిపల్లి, నాగర్‌కర్నూల్‌, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి, ఎత్తం, కొల్లాపూర్‌లో రెగ్యులర్‌ డిస్పెన్సరీలు ఉన్నాయి. పెనిమిళ్లలో హోమియో వైద్యశాల కొనసాగుతోంది. అదే విధంగా నేషనల్‌ రూరల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) కింద రఘుపతిపేట, ఉప్పునుంతల, తిమ్మాజిపేట, పాలెం, లట్టుపల్లిలో హోమియో వైద్యశాలలు కొనసాగుతున్నాయి. యునాని వైద్యానికి సంబంధించి కోడేరు, కల్వకుర్తి ప్రాంతంలో సెంటర్లు ఉన్నాయి. తెలకపల్లి, బల్మూరు, లింగాల, పదర, బొప్పల్లి, ఉప్పునుంతల, పెద్దకొత్తపల్లి, వంగూరు ప్రాంతాల్లో ఆయుర్వేద వైద్యశాలులు కొనసాగుతున్నాయి.

యోగా వల్ల మానసిక ఒత్తిడి తగ్గడంతో పాటు ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే జిల్లాలోని ఆయుష్‌ వైద్యశాలల్లో ఏర్పాటు చేసిన యోగా సెంటర్లు నిరుపయోగంగా ఉన్నాయి. యోగా సెంటర్లలో సిబ్బందిని నియమించినప్పటికీ సరైన వసతులు లేకపోవడం.. ఊరికి దూరంగా ఉండటంతో ప్రజలు ఆసక్తి చూపడం లేదు. జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలోని యోగా సెంటర్‌ మొదటి అంతస్తులో ఉండటం.. సరైన రెయిలింగ్‌ లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. అధికారులు యోగా సెంటర్లపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చి అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం..

జిల్లా ఆయుష్‌ విభాగంలో వైద్యులు, సిబ్బంది పోస్టుల ఖాళీలు, ఇతర సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ఆయుష్‌ ఆస్పత్రుల్లో అవసరమైన అన్ని వసతులు కల్పించడంతో పాటు మందుల కొరత లేకుండా చూస్తాం. యోగా సెంటర్లను సద్వినియోగం చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పిస్తాం.

– సురేష్‌, జిల్లా ఆయుష్‌ ప్రోగ్రాం మేనేజర్‌

జిల్లా జనరల్‌ ఆస్పత్రి ఆవరణలో ఉన్న యోగా సెంటర్‌1
1/2

జిల్లా జనరల్‌ ఆస్పత్రి ఆవరణలో ఉన్న యోగా సెంటర్‌

అందని ‘ఆయుష్‌’! 2
2/2

సురేష్‌, జిల్లా ఆయుష్‌ ప్రోగ్రాం మేనేజర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement