
భూ భారతిపై అవగాహన కలిగి ఉండాలి
తిమ్మాజిపేట: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, ఈ చట్టం ప్రకారం భూముల రికార్డులు క్రమబద్దీకరించేందుకు త్వరలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని ఇన్‌చార్జ్ కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని రైతువేదికలో భూ భారతిపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. భూ భారతి చట్టంలో తహసీల్దార్‌కు సమస్య పరిష్కరించే అధికారం ఉందని.. ఆయన పరిష్కరించకుంటే ఆర్డీఓ, కలెక్టర్, కమిషనర్ వరకు వెళ్లవచ్చన్నారు. 30 రోజుల్లో సమస్య పరిష్కారంగాకపోతే ఆన్‌లైన్‌లోనే రికార్డు వస్తుందని తెలిపారు. త్వరలోనే గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని.. అవసరమైన ధ్రువపత్రాలు అధికారులకు చూపించాలన్నారు. ఇప్పటి వరకు అక్రమంగా ఉన్న పట్టాలను రద్దు చేస్తామని చెప్పారు. అంతకుముందు అదనపు కలెక్టర్ అమరేందర్, ఆర్డీఓ నరేష్ చట్టం గురించి సమగ్రంగా వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రామకృష్ణయ్య, డీటీ జ్యోతి, ఆర్‌ఐలు రవిచంద్ర, హారిక, శ్రీకాంత్, కాంగ్రెస్ నాయకులు, పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు.
రికార్డులను క్రమబద్ధీకరించేందుకే రెవెన్యూ సదస్సులు
ఇన్‌చార్జ్ కలెక్టర్ విజయేందిర బోయి