
కందనూలు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసిందని, ఎన్ని కుట్రలు చేసినా ప్రజావ్యతిరేక నిర్ణయాలపై ప్రశ్నిస్తూనే ఉంటామని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత నాగం జనార్ధన్‌రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కూడలిలో కాంగ్రెస్ శ్రేణులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ర్యాలీగా కలెక్టరేట్ వెళ్లి అక్కడే కొద్దిసేపు బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈసందర్భంగా నాగం మాట్లాడుతూ.. ప్రశ్నించే గొంతుకలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దర్యాప్తు సంస్థలతో వేధింపులకు పాల్పడుతున్నాయని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ వచ్చిన ప్రజాదరణను చూసి ఓర్వలేకనే బీజేపీ ప్రభుత్వం ఇలాంటి కక్ష సాధింపు చర్యలు పాల్పడుతుందని విమర్శించారు. రాహుల్ గాంధీకి సమస్త ప్రజానికం అండగా ఉంటుందని, కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ పోకడలను ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి, పీసీసీ సభ్యులు బాలగౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి అర్థం రవి, పాండు, కోటయ్య లక్ష్మయ్య, వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.