ఎస్‌ఎస్‌తాడ్వాయి: మినీ మేడారం జాతరకు ఇంకా 83 రోజులే సమయం ఉంది. జాతర గడువు సమీపిస్తున్నా మేడారంలో అభివృద్ధి పనులపై అధికారులు దృష్టి సారించని పరిస్థితి నెలకొంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 నుంచి 20వ తేదీ వరకు మినీ జాతర తేదీలను పూజారులు ఇప్పటికే ప్రకటించారు. సంక్రాంతి పండుగ సమయం నుంచి భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మేడారంలో భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు ఇప్పటి నుంచే దృష్టి సారించి అభివృద్ధి పనులు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. జాతర సమయంలో లక్షలాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకునేందుకు వస్తుంటారు. ఈ క్రమంలో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పనులు చేపట్టాలని కోరుతున్నారు.
సంక్రాంతి నుంచి పెరగనున్న రద్దీ
మేడారం వనదేవతలను దర్శించుకునేందుకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు నిత్యం వస్తుంటారు. జాతర సమయం దగ్గరపడే కొద్ది భక్తుల రద్దీ పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా సంక్రాంతి సెలవుల నుంచి మేడారానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సమేతంగా వచ్చే భక్తులు అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటూ పూజలు నిర్వహిస్తారు. ఈ మేరకు అధికారులు అభివృద్ధి పనులపై ఇప్పటి నుంచే దృష్టి సారిస్తే అభివృద్ధి పనులు పూర్తయ్యే అవకాశం ఉంటుంది.
సీసీ కెమెరాల ఏర్పాటు ప్రధానం
గద్దెల ప్రాంగణంలో సీసీ కెమెరాలు తక్షణమే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కెమెరాల ద్వారా భక్తుల రద్దీని నిరంతరం పర్యవేక్షించడంతో పాటు భక్తులు సమర్పించే కానుకల భద్రతకు సైతం రక్షణ ఉంటుంది. భక్తుల రాకపోకలపై నిఘా, కానుకల భద్రత, అవాంఛనీయ ఘటనల నివారణకు సీసీ కెమెరాల ఏర్పాటు ఎంతగానో దోహదపడనుంది. అదేవిధంగా అధికారులు చెత్త సేకరణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి మేడారంలో భక్తుల సౌకర్యార్ధం చేపట్టాల్సిన పనులపై ప్రణాళికలతో ముందుకెళ్లాలని పూజారులు, భక్తులు కోరుతున్నారు.
తాగునీరు, మరుగుదొడ్లు తప్పనిసరి
మేడారానికి వచ్చే భక్తులకు తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. అలాగే భక్తులు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో తాగునీటి కుళాయిలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అధికారులు నిర్లక్ష్యం చేయకుండా నీటి సరఫరాలో అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. అలాగే జాతరకు వచ్చే భక్తుల్లో మహిళలు, వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. భక్తుల సౌకర్యార్థం తగినన్ని మరుగుదొడ్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇప్పటికే ఉన్న మరుగుదొడ్లకు మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకొస్తే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండే అవకాశం ఉంటుంది.
మినీ మేడారానికి
మిగిలింది 83 రోజులే..
వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 నుంచి
20 వరకు జాతర
తాగునీరు, మరుగుదొడ్లపై
ప్రణాళికలు కరువు
సంక్రాంతి నుంచే పెరగనున్న
భక్తుల తాకిడి


