● రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
ములుగు/ములుగు రూరల్/గోవిందరావుపేట: తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వనున్న 8వ జాతీయ స్థాయి ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో క్రీడాకారులు ప్రతిభ కనబర్చి పతకాలు సాధించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ భోర్కడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రాంనాథ్‌కేకన్, జిల్లా అటవీశాఖ అధికారి వికాస్ మీనాతో కలిసి మంత్రి సీతక్క ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026పై అధికారిక పోస్టర్, లోగో, మస్కట్, సెల్ఫీ పాయింట్‌ను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో పాల్గొనే క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. క్రీడల్లో ప్రతిభ కనబర్చి పతకాలు సాధించి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. డిసెంబర్ 11 నుంచి 22వ తేదీ వరకు జరగనున్న ఈ పోటీలపై విద్యార్థులు, యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలకు క్రీడలపై అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి ధర్మనాయక్, ఆత్మ కమిటీ ములుగు డివిజన్ చైర్మన్ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో 100 రోజుల ఉచిత శిక్షణ పొందిన వారికి ముగింపు కార్యక్రమం కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్‌రాంనాథ్ కేకన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అభ్యర్థులు ఉద్యోగమే లక్ష్యంగా శ్రమించాలని పలు సూచించారు. అలాగే గోవిందరావుపేట మండలంలోని చల్వాయి ఫంక్షన్‌హాల్లో చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఐదు మండలాలకు చెందిన 186 మంది లబ్ధిదారులకు మంత్రి పింఛన్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు.


