ములుగు: యాసంగి సీజన్‌కు సంబంధించి జిల్లా వ్యవసాయ శాఖ 2026–27 రబీ యాక్షన్ ప్లాన్‌ను ఖరారు చేసింది. రానున్న యాసంగి సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా మొత్తం 70,795 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేయాలని లక్ష్యంగా నిర్ధేశించింది. ఇందులో ప్రధానంగా వరి పంటకు పెద్దపీట వేస్తూ 49,200 ఎకరాల్లో సాగు చేయాలని ప్రతిపాదించింది. వరి తర్వాత మొక్కజొన్నకు ప్రాధాన్యమిస్తూ 17,027 ఎకరాల్లో సాగు చేయాలని ప్రణాళిక రూపొందించింది. గత యాసంగి సీజన్‌లో 98,459 ఎకరాల్లో పంటలు సాగు కాగా ఈసారి 70,795 ఎకరాలకు సాగు విస్తీర్ణాన్ని ప్రతిపాదించడం గమనార్హం.
రామప్ప జలాశయం ద్వారా తాగునీరు
జిల్లాలోని రామప్ప జలాశయం ద్వారా ములుగు, వెంకటాపురం(ఎం), మల్లంపల్లి, గోవిందరావుపేట మండలాల్లోని 152 గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని అందిస్తున్నారు. ఎల్‌నినో నేపథ్యంలో తాగునీటికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు అధికారులు ప్రకటించి రామప్ప సరస్సు కింద సైతం యాసంగిలో వరిపంట వేయవద్దని అధికారులు సూచిస్తున్నారు. దీంతో రామప్ప చెరువు కింద సైతం వరిపంట సాగయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. జిల్లాలో ఇప్పటికే భూగర్భజలాలు అడుగంటిపోయాయి. యాసంగిలో బోరుబావుల కింద వరిపంట సాగు చేస్తే పంటలు చేతికందే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. వ్యవసాయ అధికారులు యాసంగిలో వరిపంటకు ప్రాధాన్యతనిస్తూ ప్రణాళికలు ఖరారు చేయడంపై అన్నదాతల్లో ఆందోళన నెలకొంది. వరిపంట వేయాలా.. ఆరుతడిపంటలు వేసుకోవాలా అనే సందిగ్ధంలో రైతులు ఉన్నారు.
4,568 ఎకరాల్లో పప్పుధాన్యాలు,
నూనెగింజల సాగు..
ప్రత్యామ్నాయ పంటల సాగుకు కూడా ఈసారి ప్రణాళికలో చోటు కల్పించారు. జిల్లాలో 1,329 ఎకరాల్లో వేరుశనగ, 1,157 ఎకరాల్లో మినుములు, 1,018 ఎకరాల్లో పెసర్లు, 509 ఎకరాల్లో బొబ్బర్లు, 266 ఎకరాల్లో నువ్వులు,110 ఎకరాల్లో కందులు, 100 ఎకరాల్లో ఉలవలు, 40 ఎకరాల్లో శనగలు, 39 ఎకరాల్లో జొన్నలు సాగు చేయాలని ప్రణాళికలో పొందుపరిచారు. గత యాసంగి సీజన్‌న్‌లో సాగైన విస్తీర్ణంతో పోలిస్తే ఈసారి వరి, మొక్కజొన్న, వేరుశనగ, బొబ్బర్లు సాగు విస్తీర్ణాన్ని తగ్గించి, పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాల సాగును పెంచేలా ప్రతిపాదనలు రూపొందించారు.
జిల్లాలో 70,795 ఎకరాల్లో
సాగుకు ప్రణాళికలు
49,200 ఎకరాల్లో వరిపంట
17,027 ఎకరాల్లో
మొక్కజొన్న సాగు లక్ష్యం
4,568 ఎకరాల్లో పప్పుధాన్యాలు,
నూనెగింజలకు ప్రోత్సాహం
వరి సాగుకే ప్రాధాన్యం
జిల్లాలో యాసంగి సాగు ప్రణాళికలో వరి పంట అగ్రస్థానంలో నిలిచింది. గత సీజన్‌లో 73,801 ఎకరాల్లో వరి సాగు చేయగా ఈసారి 49,200 ఎకరాల్లో సాగు చేయాలని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. మొక్కజొన్న గత సీజన్‌లో 21,380 ఎకరాల్లో సాగు కాగా ఈసారి 17,027 ఎకరాలుగా లక్ష్యాన్ని నిర్ధేశించారు. ఎల్‌నినో నేపథ్యంలో ఆరుతడి పంటలు వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నప్పటికీ జిల్లాలో వరిపంటకు ప్రాధాన్యతనిస్తూ యాక్షన్ ప్లాన్ రూపొందించడం అయోమయానికి గురిచేస్తుంది. జిల్లాలో 805 చెరువులు, కుంటలు ఉన్నప్పటికి 80 శాతానికి పైగా చెరువులు, కుంటలు నీరు లేక ఎండిపోయాయి. జిల్లాలో ప్రధాన జలాశయాలైన లక్నవరం, పాలెం వాగు, మల్లూరు ప్రాజెక్టులలో నీటి లభ్యత లేక తైబందీలు ఖరారు చేయలేదు.


