గణపురం: గణపురం మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ దంపతులు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ అర్చకులు నాగరాజు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
రామప్పలో జర్మనీ దేశస్తులు
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని మంగళవారం జర్మనీ దేశానికి చెందిన సుసాన్ సియో, మెల్చియర్స్ కాథరినా సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామిని వారు దర్శించుకోగా ఆలయ అర్చకులు హరీశ్ శర్మ, ఉమాశంకర్‌లు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. టూరిజం గైడ్ గోరంట్ల విజయ్‌కుమార్ ఆలయ చరిత్ర, శిల్పకళ వైభవం, కాకతీయుల చరిత్ర గురించి వారికి వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని వారు కొనియాడారు. అదేవిధంగా రామప్ప దేవాలయాన్ని ట్రైనీ డీఎస్పీలు మహేశ్‌గౌడ్, సాయి విశ్వనాథ్‌లు సందర్శించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. గైడ్ విజయ్‌కుమార్ ఆలయ విశిష్టత గురించి వారికి వివరించారు. వారి వెంట ఈఓ ఇమ్మడి భాస్కర్, టూరిస్ట్ పోలీసులు భద్రు, అరుణ్, శ్రీకాంత్ ఉన్నారు.
ప్రయాణికులకు రైల్వే షాక్!
● ప్రత్యేక రైళ్లకు ముగియనున్న గడువు.. పొడిగింపుపై రైల్వే శాఖ మౌనం
సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్, కాజీపేట మీదుగా నడుస్తున్న తిరుపతి ప్రత్యేక రైళ్ల సేవలకు బ్రేక్ పడనుందా? నాలుగు నెలలుగా ప్రయాణికులకు అందుబాటులో ఉన్న వారాంతపు ప్రత్యేక రైళ్ల గడువు ముగుస్తున్నా.. వాటిని పొడిగించడంపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులతో పాటు ఉత్తర తెలంగాణ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది.
నాలుగు నెలలుగా సేవలు..
ఇక నిలిచిపోనున్నాయా?
నాందేడ్–తిరుచానూరు (07603), జాల్నా–తిరుపతి (07814) ప్రత్యేక వారాంతపు ఎక్స్‌ప్రెస్ రైళ్లు వరంగల్, కాజీపేట, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్ మీదుగా ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. గత జూన్, జూలై నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ సర్వీసులు నాలుగు నెలలుగా భక్తులకు ఎంతో ఉపయోగకరంగా మారాయి. వరంగల్ నుంచి తిరుపతి వెళ్లే భక్తులతో పాటు బాసర, నిజామాబాద్, ఆర్మూర్, కోరుట్ల ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు కూడా వీటిని ఇంటర్‌సిటీ రైళ్ల తరహాలో వినియోగించుకుంటున్నారు.
వరుసగా ముగియనున్న సర్వీసులు..
ప్రత్యేక రైళ్ల గడువు ముగింపు తేదీలు సమీపిస్తున్నాయి. నాందేడ్ నుంచి తిరుచానూరుకు వెళ్లే 07603 రైలు పొడిగింపు లేకపోతే మంగళవారంతో చివరి సర్వీసు పూర్తి చేసుకోనుంది. జాల్నా నుంచి తిరుపతికి వెళ్లే 07814 రైలు ఈనెల 26తో చివరి పరుగు తీయనుంది. తిరుగు ప్రయాణంలో తిరుచానూరు–నాందేడ్ (07604) ఈ నెల 26న, తిరుపతి–జాల్నా (07815) 28న చివరి సర్వీసులు నడపనున్నాయి. కాగా, ప్రయాణికుల ఆదరణ ఉన్న ఈ ప్రత్యేక రైళ్లను మరికొంతకాలం కొనసాగించాలని వరంగల్, కాజీపేట ప్రాంతాల ప్రయాణికులు కోరుతున్నారు.


