ములుగు రూరల్: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఆశ వర్కర్ల వేతనాలు పెంచుతామని మంత్రి సీతక్క హామీ ఇచ్చినట్లు ఆ సంఘం నాయకులు తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించాలని.. లేని పక్షంలో వచ్చేనెల 15 నుంచి నిరవధిక సమ్మె చేపడుతామని పేర్కొంటూ మంగళవారం ములుగులో మంత్రికి సమ్మె నోటీస్ అందజేశారు. ఈ సందర్భంగా ఆశ వర్కర్ల డిమాండ్లపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు వారు వెల్లడించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 28 వేల మంది ఆశా వర్కర్లు 20 ఏళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలందిస్తున్నారని తెలిపారు. గర్భిణులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించేలా ప్రోత్సహించడం, తల్లీబిడ్డల ప్రాణాలను కాపాడటం, సీజనల్, అంటువ్యాధులు, ధీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణతో పాటు కరోనా సమయంలోనూ కీలక సేవలందించారని తెలిపారు. అంతటి బాధ్యతలు నిర్వహిస్తున్న ఆశ వర్కర్లకు ప్రస్తుతం నెలకు కేవలం రూ.9,900 పారితోషకం మాత్రమే చెల్లిస్తున్నారని తెలిపారు. ఐదేళ్లుగా వేతనాలు పెరగలేదని తెలిపారు. ఆశ వర్కర్లకు నెలకు రూ. 18 వేల ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలని, పీఎఫ్. ఈఎస్‌ఐ సౌకర్యాలతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని మంత్రికి వివరించినట్లు తెలిపారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే డిసెంబర్ 15 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు నీలాదేవి, మంజుల, అనిత, సంధ్య, రజిత తదితరులు పాల్గొన్నారు.


