ములుగు/వాజేడు: జిల్లా కేంద్రంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్‌లో పలువురు విద్యార్థులు ప్రతిభ కనబర్చారు.వెంకటాపురం(ఎం) మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన విద్యార్థినులు శ్రావ్య, స్వాతి ప్రతిభకనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. గ్రౌండ్ వాటర్ రీచార్జ్ పేరుతో ఇంకుడు గుంతల ప్రాముఖ్యతపై క్షేత్రస్థాయి సర్వే నిర్వహించి నివేదిక రూపొందించారు. ఈ ప్రాజెక్టును పోటీల్లో ప్రదర్శించగా జిల్లా స్థాయిలో మొదటి బహుమతి లభించింది. దీంతో విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు రాధిక, గైడ్ టీచర్ కిరణ్ కుమార్‌తో పాటు ఉపాధ్యాయులు బాబురావు, ఫిరోజ్, సంధ్యారాణి, అంబేద్కర్, వేణు, కిశోర్ విద్యార్థినులు శనివారం అభినందించారు. అదే విధంగా వాజేడు మండల పరిధిలోని గుమ్మడి దొడ్డిలోని యూపీఎస్‌కు చెందిన విద్యార్థులు ఎం.హర్షవర్ధన్, ఎం.జీవన్ తేజలు గ్రే వాటర్ టూ గ్రీన్ గార్డెన్ ప్రాజెక్టును తయారు చేసి న్యాయ నిర్ణేతలను ఆకట్టుకున్నారు. దీంతో వారు పోటీల్లో ద్వితీయస్థానంలో నిలిచి ప్రశంసపత్రాలు అందుకుని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఎంఈఓ వెంకటేశ్వరరావు, పాఠశాల హెచ్‌ఎం గిరిప్రసాద్, ఉపాధ్యాయుడు నాగార్జున అభినందించారు.


