వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయానికి విశాఖపట్నంకు చెందిన కీల ప్రదీప్‌కుమార్, ఝాన్సీరాణి దంపతులు గురువారం స్టీల్ హుండీని బహూకరించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఇమ్మడి భాస్కర్ మాట్లాడారు. భక్తులు ఆలయ అభివృద్ధికి, సౌకర్యాల కల్పనకు తమ వంతు సహకారం అందించడం అభినందనీయమన్నారు. భక్తుల సౌకర్యార్థం హుండీని బహూకరించిన దాతలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ అభివృద్ధిలో భక్తులు, దాతల సహకారం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
11 మందిపై కేసు నమోదు
ములుగు రూరల్: గత నెల 25న జిల్లాలో రైస్ మిల్లర్లను అరెస్ట్ చేస్తున్న క్రమంలో తమ విధులకు ఆటంకం కలిగించారని సీఐడీ అధికారులు మరుసటి రోజు ములుగు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టి 11 మందిని గుర్తించి ఆధార్‌కార్డు వివరాల ప్రకారం కేసు నమోదు చేసినట్లు సమాచారం. రైస్ మిల్లర్ల కుటుంబ సభ్యులతో పాటు జాకారం గ్రామానికి చెందిన కొంత మంది వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విషయంపై పోలీసులను వివరణ కోరగా విచారణ చేపట్టి 11 మందిపై కేసు నమోదు చేశామని మరికొంతమంది వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.
ఏఐటీయూసీ
పోరాట ఫలితమే..
భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో డిస్మిస్ కార్మికులకు తిరిగి ఉద్యోగావకాశాలు కల్పించడం ఏఐటీయూసీ పోరాట ఫలితమేనని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ అన్నారు. ఈ విజయాన్ని ఇతర కార్మిక సంఘాలు తమ ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. భూపాలపల్లి ఏరియాలోని కొమురయ్య భవన్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గుర్తింపు సంఘంగా ఉన్న సమయంలో యాజమాన్యంతో కుదుర్చుకున్న ఒప్పందాల్లో డిస్మిస్ కార్మికుల పునర్నియామక అంశాన్ని చేర్చామని, సమ్మె నోటీసులు, నిరంతర పోరాటం ఫలితంగా ప్రభుత్వం, యాజమాన్యం సర్క్యులర్ జారీ చేశాయని తెలిపారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ వైస్ ప్రెసిడెంట్ మాతంగి రామచందర్, అసిస్టెంట్ బ్రాంచ్ కార్యదర్శి గురిజపల్లి సుధాకర్‌రెడ్డి, భీమనాధుని సత్యనారాయణలు పాల్గొన్నారు.
నిట్ వరంగల్‌తో ఎంఓయూ
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌తో మోసాఫ్ట్ (ఎంఓహెచ్) టెక్ ప్రైవేట్ లిమిటెడ్‌తో గురువారం పరస్పర ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ, మోసాఫ్ట్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ, సహ వ్యవస్థాపకురాలు సుభా చాగంటి ఒప్పంద పత్రాలు మార్చుకుని మాట్లాడారు. నిట్ వరంగల్ ఎంహెచ్ సాఫ్ట్ టెక్‌తో కమర్షియల్ ఎంఓయూను నిట్ వరంగల్‌లోని ఫిజిక్స్ విభాగం ఆధ్వర్యంలో ఆవిష్కరించిన స్వదేశీ ఓజోన్ ఆధారిత క్రిమి సంహారక సాంకేతికతను అందజేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ తెలిపారు. నిట్ వరంగల్‌లో ఎంఓయూ కుదుర్చుకోవడం ఆనందంగా ఉందని ఎంఓహెచ్ సాఫ్ట్‌టెక్ సీఈఓ సుభా చాగంటి తెలిపారు. కాగా, దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల కోసం సాంకేతికత ఆధారిత ఉత్పత్తులను తయారు చేసేందుకు ఎంఓయూ తోడ్పడుతుందని ఎంఓహెచ్ సాఫ్ట్ టెక్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్, సహ వ్యవస్థాపకుడు, నిట్ పూర్వ విద్యార్థి శ్యామ్ మామిడి తెలిపారు. కార్యక్రమంలో నిట్ ఫిజిక్స్ డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్లు డి.హరనాథ్, ఆర్.రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఆస్పత్రి పరిశీలన
భూపాలపల్లి అర్బన్: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, వారికి కల్పిస్తున్న సౌకర్యాలను అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటరత్నంను వైద్యసేవలు, ఓపీ సేవలు, రోగులకు సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం జనరల్ మెడిసిన్ విభాగానికి వెళ్లి అక్కడి వైద్యుడి వద్ద సాధారణ వైద్య పరీక్షలు చేయించుకున్నారు.


