ములుగు: మున్సిపాలిటీలో భారీగా పెంచిన ఆస్తి పన్నులపై ప్రజాప్రతినిధుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ మేరకు గురువారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో పన్నుల పెంపుపై అఖిలపక్ష కౌన్సిలర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 80 నుంచి 100 శాతం వరకు పన్నులు పెంచడం సామాన్య ప్రజలకు భారంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్నులు తగ్గించేందుకు కమిషనర్ అంగీకరించకపోవడంతో కౌన్సిలర్లు సమావేశాన్ని వాకౌట్ చేసి బయటకు వచ్చి నిరసన తెలిపారు. గతంలో వందల్లో ఉన్న ఇంటి, దుకాణాల పన్నులు ప్రస్తుతం వేల రూపాయలకు చేరాయని కౌన్సిలర్లు పేర్కొన్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఈ భారం తీవ్ర ప్రభావం చూపుతుందని వివరించారు. పెంకుటిళ్లకు సైతం వేల రూపాయల పన్నులు విధించడం దారుణమన్నారు. పన్నులు చెల్లించలేక ఇళ్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న వ్యాపారులు ఇప్పటికే వ్యాపారాలు లేక ఇబ్బందులు పడుతుంటే, పెరిగిన పన్నులు మరింత భారంగా మారాయన్నారు. దుకాణాలు మూసుకునే పరిస్థితి ఏర్పడుతోందని వాపోయారు. నూతన మున్సిపాలిటీలో పన్నుల పెంపుపై చట్ట నిబంధనలను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. భువన సర్వేపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పట్టణ సభ నిర్వహించాలని అఖిలపక్ష కౌన్సిలర్లు కోరారు. పన్నులు తగ్గించే ప్రసక్తే లేదని కమిషనర్ స్పష్టం చేయడంతో సమావేశం వాకౌట్ చేసినట్లు అఖిలపక్ష కౌన్సిలర్లు కోయిల లక్ష్మి, బైకానీ సునీత, రేసోజు పద్మ, బైకాని అనూష, గండ్రకోట వాణి తెలిపారు.
నివాస గృహాలకు పాత పన్నులే
:మున్సిపల్ కమిషనర్ సంపత్
మున్సిపాలిటీలో నివాస గృహాలకు పాత పన్నులే ఉన్నాయని మున్సిపల్ కమిషనర్ సంపత్ స్పష్టం చేశారు. మున్సిపల్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నివాస గృహాలకు గతంలో గ్రామపంచాయతీ పరిధిలో అమలైన చదరపు అడుగుకు 20 పైసల పన్ను రేటునే కొనసాగిస్తున్నామని తెలిపారు. గతంలో ప్రత్యేక పన్ను విధానం లేని వాణిజ్య భవనాలకు మాత్రమే మున్సిపల్ చట్టం–2019 నిబంధనల ప్రకారం తొలిసారిగా పన్ను ఖరారు చేసినట్లు వెల్లడించారు. కౌన్సిల్ తీర్మానం మేరకు చదరపు అడుగుకు 30 పైసల రేటును నిర్ణయించామని తెలిపారు. కలెక్టర్ ఆమోదం, గెజిట్ ప్రక్రియ అనంతరం సీడీఎంఏ మార్గదర్శకాల ప్రకారం ఆన్‌లైన్‌లో నమోదు చేశామని వివరించారు. మున్సిపాలిటీగా మారిన అనంతరం భవనాల కొలతలు, నిర్మాణ విస్తీర్ణం, భూముల విలువల ఆధారంగా పన్నుల మదింపు చేపట్టడంతో కొన్ని భవనాల పన్నులు తగ్గగా, మరికొన్నింటికి పెరిగినట్లు కనిపిస్తోందన్నారు. పన్నుల వసూళ్ల ద్వారా వచ్చే ఆదాయం పట్టణంలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులకు ఉపయోగపడుతుందని తెలిపారు. భువన్ సర్వే ద్వారా ప్రజలు తమ ఆస్తుల విస్తీర్ణం, భవన నిర్మాణ వివరాలు, భూమి సరిహద్దులను జియో కో ఆర్డినేట్లతో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. పన్నులపై ప్రజలు అపోహలకు గురికాకుండా వాస్తవాలను తెలుసుకోవాలని కమిషనర్ సంపత్ కోరారు.
సమావేశం వాకౌట్ చేసి నిరసన


