● రాష్ట్ర పంచాయతీరాజ్,
గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
ఏటూరునాగారం: అభ్యర్థులు ఒత్తిడికి గురికాకుండా పట్టుదలతో చదివి విజయం సాధించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ యూత్ ట్రైనింగ్ సెంటర్‌లో నిర్వహిస్తున్న ఎస్సై, పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని, స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు, ఎంబ్రాయిడరీ, అల్లికల శిక్షణను మంత్రి గురువారం పరిశీలించారు. అభ్యర్థులతో నేరుగా మాట్లాడి శిక్షణ, వసతి సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఉద్యోగాలు సాధించేలా అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. జిల్లాకు మరిన్ని పోస్టులు కేటాయించాలని సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడామని తెలిపారు. అదనపు పోస్టుల కోసం ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. జిల్లా యువతకు శిక్షణ అందించేందుకు కలెక్టర్, ఎస్పీ, ఐటీడీఏ పీఓతో చర్చించి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ఐటీడీఏ ద్వారా గిరిజన అభ్యర్థులకు, పోలీసు శాఖ ఆధ్వర్యంలో అన్ని వర్గాల అభ్యర్థులకు శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. విశ్వ అకాడమీ ద్వారా కల్పిస్తున్న శిక్షణ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా గిరిజన భవన్‌లో శిక్షణ పొందుతున్న పోలీస్ కానిస్టేబుళ్లు, ఎస్సై శిబిరాన్ని మంత్రి సందర్శించారు. పోటీ పరీక్షల్లో అభ్యర్థులు ప్రణాళికతో చదవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి, ఆత్మ కమిటీ చైర్మన్ రఘు, జేడీఎం కొండల్‌రావు, ఇర్సవడ్ల వెంకన్న, దేవులపల్లి విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


