● కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు
ములుగు: గోదావరి పుష్కరాలు–2027 సందర్భంగా జిల్లాకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్పీ సుధీర్ రాంనాథ్‌కేకన్, ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో, జిల్లా అటవీశాఖ అధికారి వికాస్ మీనాలతో కలిసి గోదావరి పుష్కరాల ముందస్తు ఏర్పాట్లపై గురువారం కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శాఖల వారీగా చేపట్టాల్సిన పనులు, మౌలిక సదుపాయాల కల్పన, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలపై సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మంగపేట, చుంచుపల్లి, రామన్నగూడెం పుష్కర ఘాట్లను సంసిద్ధం చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుత సదుపాయాలను పరిశీలించి అవసరమైన మరమ్మతులు, నూతన పనులను గుర్తించి ప్రతిపాదనలు పంపించాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, తమ పరిధిలో చేపట్టాల్సిన పనుల ప్రతిపాదనలను సకాలంలో సమర్పించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మహేందర్‌జీ, సంపత్‌రావు తదితరులు పాల్గొన్నారు.
దినసరి వేతనాల సవరణపై చర్చ
దినసరి వేతన ఉద్యోగుల సంక్షేమానికి న్యాయమైన వేతనాలను నిర్ణయించే అంశంపై కలెక్టర్ సహదేవరావు సంబంధిత అధికారులతో గురువారం చర్చించారు. కలెక్టరేట్‌లో వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న దినసరి ఉద్యోగుల వేతనాల సవరణ, పెంపుదలపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. వేతనాలను సవరించడం, పెంపుదల చేయడంపై కలెక్టర్ చర్చించారు. సమావేశంలో సహాయ కార్మిక అధికారి వినోద, డీఏఓ సురేశ్‌కుమార్, డీసీవో రామ్మోహన్, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి రవీందర్ పాల్గొన్నారు.


