వనదేవతలకు భక్తులు సమర్పించిన బెల్లం తిరిగి వ్యాపారుల చెంతకు | - | Sakshi
Sakshi News home page

వనదేవతలకు భక్తులు సమర్పించిన బెల్లం తిరిగి వ్యాపారుల చెంతకు

Nov 5 2026 12:58 AM | Updated on Nov 5 2026 12:58 AM

ఎస్‌ఎస్‌తాడ్వాయి: సమ్మక్క–సారలమ్మ కొలువైన మేడారంలో భక్తుల సమర్పించే ఎత్తు బంగారం కొంతమందికి వ్యాపార వనరుగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో అమ్మవార్లకు భక్తులు భక్తిశ్రద్ధలతో మొక్కుగా సమర్పించే ఎత్తు బంగారం (బెల్లం), రీసైక్లింగ్‌ దందాకు తెరలేపుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. భక్తులు గద్దెల వద్ద మొక్కుగా సమర్పించిన బెల్లం తిరిగి వ్యాపారుల చెంతకు చేరుతుంది. దాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి వ్యాపారులు రీసైక్లింగ్‌ చేసి అదే బెల్లాన్ని మార్కెట్‌ ధర ప్రకారం తిరిగి భక్తులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి.

నిత్యం భక్తుల రాక

వనదేవతలను దర్శించుకునేందుకు నిత్యం వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు మేడారానికి తరలివస్తుంటారు. అమ్మవార్లకు ఎత్తు బంగారం (బెల్లం) సమర్పించడం ఆనవాయితీ. భక్తులు ఎంతో పవిత్రంగా భావించి గద్దెల వద్ద సమర్పిస్తున్న బెల్లాన్ని అక్కడ తిష్ట వేసిన కొంత మంది వ్యక్తులు సేకరిస్తున్నట్లు సమాచారం. భక్తుల నుంచి సేకరించిన బెల్లాన్ని తక్కువ ధరకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

తక్కువ ధరకు కొనుగోలు

గద్దెల వద్ద భక్తులు మొక్కుగా సమర్పించిన బెల్లం తిరిగి వ్యాపారుల వద్దకు చేరుతున్నట్లు తెలుస్తుంది. ఆ బెల్లాన్ని కొందరు వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేసి రీసైక్లింగ్‌ చేస్తున్నట్లు సమాచారం. అనంతరం కొత్త బెల్లం రూపంలో మార్కెట్‌లోకి తీసుకొచ్చి మార్కెట్‌ ధరకు విక్రయిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇలా భక్తులు సమర్పించిన బెల్లమేతిరిగి మార్కెట్లోకి చేరి భక్తుల చేతుల్లోకి వెళ్తుండటంతో కొందరు వ్యా పారులు రెండింతల లాభాలు పొందుతున్నారు.

గుడుంబా తయారీకి కూడా సరఫరా?

గద్దెల వద్ద భక్తులు సమర్పించిన బెల్లాన్ని గుడుంబా తయారీకి సైతం విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పవిత్రమైన జాతరలో భక్తులు అమ్మవార్లకు సమర్పించిన బెల్లాన్ని కొందరు అక్రమ వ్యాపారాలకు ఉపయోగించుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. మేడారంలోని బెల్లం మంగపేట, ఏటూరునాగారం, మేడారం చుట్టు పక్కల గ్రామాలకు, భూపాలపల్లి జిల్లాలోని కాటారం ప్రాంతాల వైపు గుడుంబా తయారీకి తీసుకెళ్తున్నట్లు తెలుస్తుంది.

తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ

రీసైక్లింగ్‌

మళ్లీ మార్కెట్‌ ధరకు

విక్రయిస్తున్న వైనం

గుడుంబా తయారీకి సైతం

సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు

అధికారుల నిఘా కరువు

మేడారంలో పెద్ద ఎత్తున బెల్లం సేకరణ, కొనుగోళ్లు, రీసైక్లింగ్‌, విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. భక్తుల విశ్వాసాన్ని ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్న వారిపై విచారణ జరపాలని భక్తులు కోరుతున్నారు. బెల్లం సేకరించే వారి కార్యకలాపాలపై నిఘా పెట్టడంతో పాటు, కొనుగోలు చేస్తున్న వ్యాపారుల వివరాలు సేకరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. రీసైక్లింగ్‌ పేరుతో సాగుతున్న దందాపై దేవాదాయ, పోలీస్‌, ఎకై ్సజ్‌ శాఖల అధికారులు సమన్వయంతో తనిఖీలు చేపట్టి అడ్డుకట్ట వేయాలని భక్తులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement