ఏటూరునాగారం/ఎస్‌ఎస్‌తాడ్వాయి: వీబీజీరాంజీ పథకంలో అర్హులందరికీ జాబ్‌కార్డులు ఇవ్వాలని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. ఏటూరునగారం మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో వీబీజీరాంజీ పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాలపై ములుగు, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లోని ఏజెన్సీ మండలాల అధికారులతో ఐటీడీఏ పీఓ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 18 ఏళ్లు పైబడి అర్హులైన నిరుపేద కుటుంబాల గుర్తింపుతో పాటు నమోదు, కొత్తజాబ్ కార్డుల జారీ, మేట్స్ నియామకం, శిక్షణతో పాటు పథకం కింద చేపట్టాల్సిన గ్రామీణ అభివృద్ది పనులపై చర్చించారు. అనంతరం పీఓ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులైన ప్రతి కుటుంబాన్ని క్షేత్రస్థాయిలో గుర్తించి జాబ్‌కార్డులు అందించాలని ఆదేశించారు. గ్రామస్థాయిలో ప్రజలకు పథకంపై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం పీఓ ఏటూరునాగారంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో టైలరింగ్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై ఉచిత శిక్షణ శిబిరాన్ని సందర్శించి వారితో మాట్లాడారు. అభ్యర్థులు పోటీ పరీక్షలకు ప్రణాళికతో సిద్ధం కావాలన్నారు. అదేవిధంగా యూత్ ట్రైనింగ్ సెంటర్లో టైలరింగ్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ శిక్షణ తీసుకుంటున్న తీరును పరిశీలించారు. అభ్యర్థులు స్వయంగా తయారు చేస్తున్న వాటిని పరిశీలించి సూచనలు చేశారు. అలాగే ఎస్‌ఎస్‌తాడ్వాయి మండల పరిధిలోని మేడారంలో గల ఇంగ్లిష్ మీడియం ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆయన బుధవారం సందర్శించి పాఠశాల నిర్వహణ, విద్యార్థుల రికార్డులను పరిశీలించారు. యూడబ్ల్యూహెచ్ఎం, ఎఫ్ఆర్ఎస్ పోర్టళ్లలో విద్యార్థుల నమోదు, లాగిన్ ప్రక్రియ వివరాలను అడిగి తెలుసుకున్నారు. గిరిజన సంక్షేమ విద్యాసంస్థల్లో విద్యార్థుల వివరాల ఆన్లైన్ వేగవంతంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
పీఓ లెనిన్ వత్సల్ టొప్పో


