ములుగు: గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన, జల సంరక్షణ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్ సూచించారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి బుధవారం అన్ని జిల్లాల సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఉపాధి పనులు, కూలీల హాజరు, జాబ్‌కార్డుల జారీ, మేట్ల శిక్షణ, జలసిరి పనులు, గ్రామీణ మౌలిక వసతుల నిర్మాణాల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా నుంచి అదనపు కలెక్టర్ సంపత్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 12,760 గ్రామ పంచాయతీలకు గాను 12,280 పంచాయతీల్లో ఉపాధి పనులు ప్రారంభించినట్లు తెలిపారు. ఇంకా పనులు ప్రారంభించని పంచాయతీలపై దృష్టి సారించాలన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 171 గ్రామ పంచాయతీలకు గాను 162 పంచాయతీల్లో ఉపాధి పనులు ప్రారంభించినట్లు తెలిపారు. మంగళవారం(3వ తేదీ) 7,465 మంది కూలీలు పనులకు హాజరయ్యారని వివరించారు. జిల్లాలో ప్రారంభించిన వ్యవసాయ కుంటల పనులతో పాటు ఈ నెల 19వ తేదీ నాటికి ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాల్సిన 254 నిర్మాణాల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు అదనపు కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ రవీందర్, ఏపీడీ వెంకటనారాయణ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
వీసీలో పంచాయతీరాజ్ కమిషనర్ దివ్యదేవరాజన్


