ములుగు: జిల్లా కేంద్రంలోని రామాలయంలో ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించనున్న విగ్రహ పునఃప్రతిష్ఠాపన, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన వేడుకలను ఘనంగా నిర్వహించాలని మున్సిపల్ చైర్‌పర్సన్ చంద్రకళ అన్నారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు దొంతిరెడ్డి రాకేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఏర్పాట్లను మంగళవారం ఆమె పరిశీలించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న యాగశాలను సందర్శించి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య మూడు రోజులపాటు జరిగే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దొంతిరెడ్డి రవిరెడ్డి, వెంకట్‌రెడ్డి, పాపిరెడ్డి, వెంకటప్పారెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా మహేందర్
వెంకటాపురం(ఎం): ఉమ్మడి వరంగల్ జిల్లా ఫొటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా వెంకటాపురం(ఎం) మండల కేంద్రానికి చెందిన దేశిని మహేందర్ గౌడ్‌ను నియమించినట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గాదె లింగమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా మహేందర్ గౌడ్ మంగళవారం విలేకర్లతో మాట్లాడారు. తనపై నమ్మకంతో బాధ్యతలను అప్పగించిన జిల్లా అధ్యక్షుడు గాదె లింగమూర్తి, వర్కింగ్ ప్రెసిడెంట్ సునీల్ కుమార్, జిల్లా ఆర్గనైజర్ రాము, మాజీ అధ్యక్షుడు కందుల రవి, సీనియర్ ఫొటో గ్రాఫర్లకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఫొటోగ్రాఫర్ల హక్కుల సాధనకు, వారి సంక్షేమానికి నిరంతరం కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.
ఘనంగా రీజినల్ స్థాయి
కల్చరల్ మీట్
భూపాలపల్లి అర్బన్: సింగరేణి వర్క్‌పీపుల్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏరియాలోని కృష్ణకాలనీ కమ్యూనిటీహాల్‌లో రీజినల్ స్థాయి కల్చరల్ మీట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భూపాలపల్లి స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కార్యక్రమాల గౌరవ కార్యదర్శి మర్రి సాయికృష్ణ పూలమాల వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే ఉద్యోగులకు సాంస్కృతిక కార్యక్రమాలు మానసికోల్లాసాన్ని, నూతన ఉత్సాహాన్ని అందిస్తాయన్నారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరిన యువతతోపాటు మహిళా ఉద్యోగులు కూడా తమలోని కళా ప్రతిభను చాటుతూ ఇలాంటి కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కల్చరల్ మీట్‌లో జానపద, లలిత గీతాలు, గజల్స్, కర్ణాటక సంగీతం, వీణ, గిటార్, సింథసైజర్, వయోలిన్, క్లారినెట్, బాంజో, హార్మోనియం వంటి సంగీత విభాగాలతోపాటు కూచిపూడి, భరతనాట్యం, జానపద నృత్యం, ఆర్కెస్ట్రా విభాగాల్లో కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. వారి ప్రదర్శనలు సభికులను ఆకట్టుకున్నాయి. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన కళాకారులు తదుపరి కంపెనీ స్థాయి పోటీలకు అర్హత సాధించనున్నారు. ఈ కార్యక్రమంలో కల్చరల్ న్యాయ నిర్ణేత కుంట రాజు, స్పోర్ట్స్ సూపర్‌వైజర్ పర్స శ్రీనివాస్, భూపాలపల్లి స్పోర్ట్స్ కోఆర్డినేటర్ నాగేశ్వరరావు, కల్చరల్ కెప్టెన్ అడిచర్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.
పనుల పరిశీలన
మొగుళ్లపల్లి: వీబీజీరామ్ జీ పథకం కింద మండలంలోని ముల్కలపల్లి, ఇస్సిపేట గ్రామాల్లో జరుగుతున్న ఫీడర్ కాలువ పూడికతీత పనులను డీఆర్‌డీఓ బాలకృష్ణ మంగళవారం పరిశీలించారు. అనంతరం కూలీలతో మాట్లాడారు. భూగర్భ జలాలను పెంచే విధంగా జలసిరి కార్యక్రమంలో పనులను గుర్తించాలన్నారు. కూలీలకు 125 పనిదినాలను కల్పించాలని సూచించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్స్‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు.


