సాక్షి యాదాద్రి : ములుగు వంటి మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో ఆధునిక వైద్య సేవలు అందించేందుకు బీబీనగర్ ఎయిమ్స్ బృందం ముందుకు రావడం అభినందనీయమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్‌ను సందర్శించిన ఆమె.. ములుగు జిల్లాలో వైద్యసేవల కల్పన, ఆస్పత్రుల నిర్మాణంపై మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అటవీ ప్రాంతాల్లో మౌలిక వసతుల కొరత వల్ల గిరిజనులకు సకాలంలో వైద్యం అందడం లేదని, ఎయిమ్స్ వైద్యులు కొంతకాలమైనా ఏజెన్సీ ప్రాంతాల్లో సేవలు అందించి ప్రజలకు అండగా నిలవాలని కోరారు. ఎయిమ్స్, సమ్మక్క సారలమ్మ కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం సంయుక్తంగా ములుగు జిల్లాలో వైద్యశిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి, స్థానిక ఆదివాసీ యువతకు ప్రాథమిక వైద్య శిక్షణ ఇచ్చి ఆరోగ్య కార్యకర్తలుగా తీర్చిదిద్దడం మంచి పరిణామమన్నారు. తొలిదశలో ములుగు, ఏటూరునాగారంలో శాటిలైట్ హెల్త్ సెంటర్లు ప్రారంభించి, టెలీమెడిసిన్ సేవలను విస్తరించాలని సూచించారు. గర్భిణులు, చిన్నారుల ఆరోగ్యంపై దృష్టి సారించి రక్తహీనత, సికిల్ సెల్ వ్యాధి, మలేరియా నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. స్థానిక కోయ, గోండి, లంబాడీ భాషల్లో ఆరోగ్య అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. అనంతరం ఎయిమ్స్ రూపొందించిన ములుగు ఆరోగ్య వికాసం పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు. బిర్సా ముండా చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎయిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ అమితా అగర్వాల్, గిరిజన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ వైఎల్.శ్రీనివాస్, రీసెర్చ్ డీన్ డాక్టర్ రాహుల్ నారాక్, వైద్యులు పాల్గొన్నారు.
ములుగు ఆరోగ్య వికాసం పుస్తకం అవిష్కరిస్తున్న మంత్రి సీతక్క తదితరులు
సమీక్ష సమావేశంలో మంత్రి సీతక్క, ఎయిమ్స్ డైరెక్టర్ అమితా అగర్వాల్ తదితరులు
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి
సీతక్క


