వెంకటాపురం(ఎం): రామప్ప చరిత్ర, విశిష్టతను ప్రపంచానికి చాటడంలో, చారిత్రక కట్టడాల పరిరక్షణకు ప్రజలకు అవగాహన కల్పించడంలో వలంటీర్లు ముఖ్య పాత్ర పోషించాలని అదనపు కలెక్టర్ సంపత్‌రావు(స్థానిక సంస్థలు) అన్నారు. మండల పరిధిలోని పాలంపేటలో గల రామప్ప దేవాలయ ప్రాంగణంలో మంగళవారం నిర్వహించిన వరల్డ్ హెరిటేజ్ వలంటీర్ క్యాంప్–2026 ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పర్యాటక శాఖ నోడల్ అధికారి ధర్మనాయక్, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ప్రతినిధులు ప్రొఫెసర్ పాండురంగారావు, శ్రీధర్ రావులతో కలిసి ఆయన జ్యోతి ప్రజ్వలన చేశారు. చరిత్ర, పురావస్తు, వారసత్వ కట్టడాల సంరక్షణపై ఆసక్తితో శిక్షణకు హాజరైన వలంటీర్లను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాఉడతూ రామప్ప దేవాలయ విశిష్టతను, శిక్షణలో తెలుసుకున్న అంశాలను మరింత మందికి తెలియజేయాలని సూచించారు. వారసత్వ కట్టడాల పరిరక్షణలో యువత చురుకై న పాత్ర పోషించాలన్నారు. పర్యాటక శాఖ నోడల్ అధికారి ధర్మనాయక్ మాట్లాడుతూ ఇటువంటి శిక్షణ శిబిరాలు యువతకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఇక్కడ నేర్చుకున్న అంశాలను ఇతరులకు తెలియజేస్తూ కాకతీయుల కీర్తిని వలంటీర్లు ప్రపంచానికి చాటాలని సూచించారు. అనంతరం క్యాంపునకు హాజరైన వలంటీర్లకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఇమ్మడి భాస్కర్, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ సభ్యులు శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ చల్లగొండ రాజు, పర్యాటక శాఖ గైడ్లు గోరంటల విజయ్‌కుమార్, వెంకటేశ్, రాష్ట్ర పురావస్తు శాఖ ఫోర్‌మన్ బాబు, టూరిస్ట్ పోలీసులు అరుణ్, భద్రు, సంబంధిత శాఖల సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ సంపత్ రావు


