ములుగు: భూభారతి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంతో పాటు రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్, రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్. లోకేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల రెవెన్యూ అదనపు కలెక్టర్లతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో విజిలెన్స్ కేసులు, భూదాన్ నివేదిక, రీసర్వే, హైకోర్టు కేసులు, భూభారతి పాత, కొత్త పెండింగ్ దరఖాస్తులతో పాటు తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి అదనపు కలెక్టర్ మహేందర్‌జీ సంబంధిత అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్‌కుమార్ మాట్లాడుతూ భూభారతి కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. పాత, కొత్త దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించి, పెండింగ్ పనులను వేగవంతం చేయాలని సూచించారు. రీసర్వే ప్రణాళిక ప్రకారం పూర్తి చేసేందుకు ప్రతీ మండలానికి రెండు సర్వే బృందాలను కేటాయించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో రీసర్వే ప్రక్రియ వేగంగా సాగేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. జీవో నంబర్లు 59, 76 కింద పెండింగ్‌లో ఉన్న క్రమబద్ధీకరణ దరఖాస్తులను నిర్ణీత గడువులోగా సమగ్రంగా పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. యూఎల్‌సీ భూములు, జీవో నంబర్ 118కు సంబంధించిన పెండింగ్ అంశాలపైనా సమీక్షించారు. హైకోర్టు పరిధిలో ఉన్న భూ సంబంధిత కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. విజిలెన్స్ కేసులు, భూదాన్ నివేదిక, భూసేకరణకు సంబంధించిన పెండింగ్ అంశాల పురోగతిని సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్డీఓ కృష్ణవేణి, ఏవో రాజ్‌కుమార్, పర్యవేక్షకులు మహేశ్‌బాబు, మంజుల, తహసీల్దార్ విజయభాస్కర్, డిప్యూటీ తహసీల్దార్ మల్లేశ్వర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
వీసీలో భూపరిపాలన ప్రధాన కమిషనర్ లోకేశ్‌కుమార్


