● సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మాధవి
ములుగు: ఐకేపీ పరిధిలో పనిచేస్తున్న వీవోఏల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర అధ్యక్షురాలు మారేపల్లి మాధవి డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలో మంగళవారం సంఘం జిల్లా అధ్యక్షురాలు శెట్టి మంజుల అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వీవోఏలకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. అలాగే పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని కోరారు. విధి నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. మహిళా సంఘాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న వీవోఏలకు పనిభారం పెరుగుతున్నప్పటికీ తగిన వేతనాలు, సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. ఈ సమావేశంలో వీవోఏల సంఘం వివిధ మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
ఐసా రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్‌గా స్వాతి
భూపాలపల్లి అర్బన్: ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఐసా) రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్‌గా బుర్ర స్వాతిని నియమించినట్లు ఐసా జాతీయ కమిటీ సభ్యురాలు వేమన మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల సెమినార్ హాల్‌లో నిర్వహించిన రాష్ట్ర వర్క్‌షాప్‌లో గణపురం మండలానికి చెందిన బుర్ర స్వాతికి కన్వీనర్ బాధ్యతలు అప్పగించారు. విద్యార్థినులను ఐక్యం చేస్తూ విద్య, వైద్యం, సమానత్వం, సామాజిక న్యాయం కోసం కృషి చేస్తానని స్వాతి తెలిపారు.


