గోవిందరావుపేట: రైతు వ్యతిరేక విధానాలపై రైతులు ఐక్యంగా ఉద్యమించాలని తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ రావు అన్నారు. ఈ నెల 15 నుంచి 18 వరకు నల్లగొండలో జరుగనున్న 36వ అఖిల భారత రైతుసంఘం మహాసభల సందర్భంగా మండల పరిధిలోని పీఎస్‌ఆర్ గార్డెన్‌లో సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ విధానాలు.. వ్యవసాయంపై ప్రభావం అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 1991 తర్వాత అమల్లోకి వచ్చిన నూతన ఆర్థిక విధానాలతో విత్తన రంగం కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లిందన్నారు. దీంతో స్వేచ్ఛా వాణిజ్యం పేరుతో విదేశాల నుంచి పత్తి, మొక్కజొన్న, పాల ఉత్పత్తుల దిగుమతులకు అనుమతులు ఇవ్వడం దేశీయ వ్యవసాయ రంగంపై ప్రభావం చూపుతోందన్నారు. ఈ మేరకు స్థానికంగా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేలా పార్లమెంట్‌లో చట్టం చేయాలన్నారు. రైతు రుణాలు మాఫీ చేయాలని, 60 ఏళ్లు పైబడిన రైతులకు నెలకు రూ.10 వేల పింఛన్ ఇవ్వాలని మహాసభల్లో చర్చించనున్నట్లు తెలిపా రు. అనంతరం రైతుసంఘం సీనియర్ నాయకులు సూడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ మహాసభలకు జిల్లా రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎండి గఫూర్ పాషా, తుమ్మల వెంకట్ రెడ్డి, గుండు రామస్వామి, తీగల ఆదిరెడ్డి, సామ చంద్రారెడ్డి, ఎండా యాకుబ్, బండారి నరసింహులు, చంద్రశేఖర్, సత్యం, ముత్యాలు, శివప్రసాద్, సదానందం, అశోక్, సత్తిరెడ్డి, నాగార్జున పాల్గొన్నారు.
సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
పోతినేని సుదర్శన్‌రావు


