ములుగు రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు అందిస్తున్న ఆశ వర్కర్ల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు డిసెంబర్ 15న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించ తలపెట్టిన సమ్మె నోటీసును ఆశ వర్కర్లు మంగళవారం డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సుధీర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు ఫిక్స్‌డ్ వేతనం రూ. 18 వేలు, పీఎఫ్, ఈఎస్‌ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు అందించాలన్నారు. పారితోషికం పేరుతో ఆశ కార్యకర్తలను శ్రమదోపిడీకి గురిచేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆశాలకు కనీస వేతనం అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలాదేవి, సీఐటీయూ నాయకుడు రవిగౌడ్, ఆశ వర్కర్లు కవిత, రజిని, రమ, యశోద, జ్యోతి, రాణి, కావ్య, శ్వేత, మమత, జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్


