ములుగు: ప్రభుత్వ బియ్యాన్ని పక్కదారి పట్టించిన మిల్లర్ల విషయంలో పౌర సరఫరాల శాఖ అధికారులతో పాటు విజిలెన్స్, టాస్క్‌ఫోర్స్, ఎఫ్‌సీఐ, సీఐడీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నారని, బియ్యాన్ని పక్కదారి పట్టించిన మిల్లర్లను గుర్తించి చర్యలు తీసుకుంటామని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి (డీసీఎస్‌ఓ) సయ్యద్ షా ఫైజల్ హుస్సేనీ పేర్కొన్నారు. ఈ మేరకు సాక్షిలో వచ్చిన కథనాలపై ఆయన శనివారం స్పందించి సాక్షికి ప్రకటన విడుదల చేశారు. 2025–26 ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలోని 40 రైస్ మిల్లులకు 1,40,903 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేటాయించినట్లు తెలిపారు. ఆ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ప్రభుత్వానికి 94,405.037 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండగా70,096.078 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే మిల్లర్లు సరఫరా చేశారని తెలిపారు. ఇంకా 24,308.959 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి మిల్లర్లు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనే సీఎంఆర్ డెలివరీ సగటు 65 శాతం ఉండగా జిల్లా నుంచి 74.25 శాతం సీఎంఆర్ డెలివరీ చేసి ఆరో స్థానంలో ఉన్నట్లు వెల్లడించారు. ఇతర జిల్లాల్లో సీఎంఆర్ డెలివరీ తక్కువ ఉన్నట్లు పరోక్షంగా పేర్కొన్నారు. బియ్యం బకాయిలపై మిల్లర్లకు గడువు ఇవ్వడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లోనే ఉంటుందని వివరించారు.
సాక్షి కథనాలపై డీసీఎస్‌ఓ
సయ్యద్‌షా ఫైజల్ హుస్సేనీ వివరణ


