నీటిని పొదుపుగా వాడుకోవాలి | - | Sakshi
Sakshi News home page

నీటిని పొదుపుగా వాడుకోవాలి

Nov 1 2026 12:56 AM | Updated on Nov 1 2026 12:56 AM

ములుగు: ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో అందుబాటులో ఉన్న జలవనరులను పొదుపుగా వాడుకోవాలని కలెక్టర్‌ భోర్ఖడే హేమంత్‌ సహదేవరావు ప్రజలకు సూచించారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రానున్న వేసవి అవసరాలను దృష్టిలో ఉంచుకొని నీటిని పొదుపు చేయాలన్నారు. జిల్లాలో వానాకాలం పంటలకు రామప్ప సరస్సు ద్వారా 5,180 ఎకరాలు, లక్నవరం సరస్సు ద్వారా 4,500 ఎకరాలు, పాలెంవాగు ప్రాజెక్టు ద్వారా 7,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించినట్లు తెలిపారు. కన్నాయిగూడెం మండలం గంగారంలోని దేవాదుల పంపుహౌస్‌ ద్వారా జూలై 2026 నుంచి ఇప్పటివరకు సుమారు 16.50 టీఎంసీల నీటిని ఎత్తిపోసి, ఎతైన ప్రాంతాలకు సాగు, తాగునీటి అవసరాలకు మళ్లించినట్లు వెల్లడించారు. ఇకపై నీటి ఎత్తిపోతలు గోదావరిలో నీటి లభ్యతపై ఆధారపడి ఉంటాయని వివరించారు. ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నందున యాసంగి పంటలకు సాగునీటి విడుదల కష్టతరంగా మారిందని కలెక్టర్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని పేర్కొన్నారు. రైతులు ఈ పరిస్థితిని అర్థం చేసుకొని సహకరించాలని కోరారు. గోదావరిలో నీటి లభ్యతకు అనుగుణంగా చెరువులను నింపేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. సాగునీటికి సంబంధించిన సలహాలకు నీటిపారుదలశాఖ జిల్లా అధికారి అప్పలనాయుడు ఫోన్‌ నంబర్‌ 9704678210, కార్యనిర్వహక ఇంజినీర్‌ శంకరయ్య ఫోన్‌ నంబర్‌ 9441653031లలో సంప్రదించాలని కలెక్టర్‌ సూచించారు.

కలెక్టర్‌

భోర్ఖడే హేమంత్‌ సహదేవరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement