ములుగు రూరల్: ఆర్టీసీలో ప్రయాణించే ప్రయాణికులు తమ సందేహాలు, సలహాలను అందించేందుకు నేడు (శనివారం) డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వరంగల్ –2 డిపో మేనేజర్ రవిచందర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేడు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు నిర్వహించే కార్యక్రమానికి ప్రయాణికులు 7382425150 నంబర్‌కు ఫోన్ చేసి సలహాలు, సూచనలు అందించాలన్నారు.
రామప్పలో వేలం వాయిదా
వెంకటాపురం(ఎం): మండలంలోని పాలంపేటలోని రామప్ప దేవాలయం వద్ద నిర్వహించాల్సిన వేలం పంచాయతీ పాలకవర్గం, దేవాదాయ శాఖ మధ్య నెలకొన్న విభేదాలతో శుక్రవారం వాయిదా పడింది. ఆలయ పరిసరాల్లో దుకాణ సముదాయాలు, పార్కింగ్ ప్రదేశాలతో పాటు కొబ్బరికాయలు, లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయాలకు సంబంధించిన వేలం పాటల నిర్వహణపై ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వేలం ద్వారా వచ్చే ఆదాయంలో వాటా, నిర్వహణ బాధ్యతల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడంతో వేలం వేదిక వద్ద ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న రెవెన్యూ, పోలీసు అధికారులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను సముదాయించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా వేలంను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సమస్య పరిష్కారమైన తర్వాత తిరిగి వేలం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చల్లగొండ రాజు, ఉపసర్పంచ్ చింతం ప్రకాష్, దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ అనిల్‌కుమార్, ఆలయ కార్యనిర్వహణాధికారి ఉమ్మడి భాస్కర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
గుడ్, బ్యాడ్ టచ్‌లపై
అవగాహన ఉండాలి
● సీనియర్ సివిల్ జడ్జి చండీశ్వరీ
ఏటూరునాగారం: విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌లపై అవగాహన ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి చండీశ్వరీ అన్నారు. శుక్రవారం మండలంలోని కస్తూర్బాగాంధీ, చిన్నబోయినపల్లి డీఎన్టీ పాఠశాలలో అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సురక్షిత్ బచ్ పన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో గుడ్ టచ్, బ్యాడ్ టచ్, పొక్సో చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. బాలల రక్షణకు రూపొందించిన చట్టాలు, లైంగిక నేరాలు, బాలల రక్షణ చట్టం గురించి అవగాహన ఉండాలన్నారు. జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత మాట్లాడుతూ పిల్లలు తమకు ఎదురైన సమస్యలను స్వేచ్ఛగా వెల్ల డించగలిగే సురక్షితమైన వాతావరణాన్ని కుటుంబాలు, విద్యాసంస్థల్లో కల్పించాలన్నారు. ఏదైన సమస్య ఎదురైనప్పుడు చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, అత్యవసర పరిస్థితుల్లో 112ను సంప్రదించి సహాయం పొందవచ్చన్నారు. అనంతరం కేజీబీవీ పాఠశాలల్లోని విద్యార్థినులకు జడ్జి చండీశ్వరి, ప్రేమలత కలిసి ట్రంక్ పెట్టెలు, స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఓంకార్, చీఫ్ లీగల్ ఎయిడ్ మేకల మహేందర్, ఎస్సై కాంతారావు, షీటీమ్ ఎస్సై రాజ్యలక్ష్మీ, మౌనిక, ఉపాధ్యాయులు హరికృష్ణ పాల్గొన్నారు.
నిధుల దుర్వినియోగంపై విచారణ
వెంకటాపురం(ఎం): మండలంలోని బూరుగుపేట గ్రామ పంచాయతీని శుక్రవారం డీఎల్‌పీఓ శ్రీధర్‌రావు తనిఖీ చేశారు. నిధుల దుర్వినియోగంపై బూరుగుపేట ఉప సర్పంచ్ నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జీపీ కార్యాలయంలో పంచాయతీ రికార్డులు, ఎంబీ బుక్స్, బ్యాంక్ స్టేట్‌మెంట్లు, చెక్ రిజిస్టర్లను పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు. సర్పంచ్, ఉపసర్పంచ్‌ల నుంచి వేర్వేరుగా వివరణ తీసుకున్నారు.


