ములుగు: పల్లెల్లోని సమస్యలకు పరిష్కారం చూపే నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలని కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) సంపత్ రావు అధ్యక్షతన గురువారం నిర్వహించిన ఇన్నోవేషన్ పంచాయతీ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నేటి ఆవిష్కరణలే రేపటి భవిష్యత్తుకు పునాదులని తెలిపారు. గ్రామీణ ప్రజలు దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలను గుర్తించి వాటిని మరింత మందికి ఉపయోగపడేలా ప్రోత్సహించాలని సూచించారు. రైతులు, విద్యార్థులు, మహిళలు, యువత, చేతి వృత్తిదారుల్లోని సృజనాత్మకతను వెలుగులోకి తీసుకురావాలన్నారు. వ్యవసాయం, నీటి పొదుపు, పారిశుద్ధ్యం, చేతివృత్తులు, రోజువారీ పనులను సులభతరం చేసే వినూత్న ఆలోచనలను గుర్తించాలని సూచించారు. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో అమలవుతున్న ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంపై గ్రామస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లోని ఆవిష్కర్తలను గుర్తించడంలో చొరవ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీజీఐసీ) ప్రతినిధి సోహెల్, టీ హబ్ నుంచి అమృత, ప్రాజెక్ట్ లీడ్ విజయ్, డీఈఓ సిద్ధార్థ రెడ్డి, టీజీఐసీ గ్రాస్‌రూట్స్ లీడ్ రమేశ్ పాల్గొన్నారు. వీరు గ్రామీణ ప్రాంతాల్లోని ఆవిష్కర్తలను గుర్తించడం, స్థానిక సమస్యలకు పరిష్కారాలను ప్రోత్సహించడం, వినూత్న ఆలోచనలకు తగిన మార్గదర్శకత్వం అందించడం వంటి అంశాలపై తమ తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
కలెక్టర్ భోర్కడే హేమంత్ సహదేవరావు


