● ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో
ఏటూరునాగారం/ఎస్ఎస్ తాడ్వాయి: హాస్టల్ విద్యార్థులకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న వస్తువులన్నీ తప్పనిసరి అందించాలని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన గురువారం ఏటూరునాగారం, ఎస్ఎస్ తాడ్వాయి మండల కేంద్రాల్లోని ఎమ్మార్సీ సెంటర్లను సందర్శించి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు పంపిణీ చేస్తున్న రికార్డులను తనిఖీ చేశారు. విద్యార్థులకు అందించాల్సిన యూనిఫాం, ఐడీ కార్డులు, బెల్టులు, షూస్, సాక్సులు, ట్రాక్ షూస్, స్కూల్ బ్యాగులు, బెడ్షీట్లు, ప్లేట్లు, గ్లాసులు, ట్రంక్ బాక్సులు, దుప్పట్లు, నైట్ డ్రెస్లు తదితర 21 రకాల వస్తువుల పంపిణీ వివరాలను పరిశీలించారు. ప్రతీ విద్యార్థికి అన్ని రకాల వస్తువులు అందించాలని, వస్తువుల పంపిణీలో అవకతవకలు ఉండరాదని సూచించారు. వందశాతం వస్తువులు అర్హులైన విద్యార్థులందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం మండల విద్యాశాఖ అధికారి మల్లయ్య, తాడ్వాయి మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.


