● వీసీలో పంచాయతీరాజ్,
గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
ములుగు: ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే నీటి ఎద్దడి, కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు గ్రామాలను ముందస్తుగా సన్నద్ధం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్ సెర్ప్ కార్యాలయం నుంచి స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిశోర్, సెర్ప్ కమిషనర్ దివ్య దేవరాజ్‌లతో కలిసి మంత్రి సీతక్క బుధవారం రాష్ట్రవ్యాప్తంగా సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, జిల్లా, మండలస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపాధి హామీ పనులు, నీటి సంరక్షణ, గ్రామాభివృద్ధి పనులు, మహిళా సంఘం భవనాల నిర్మాణ పురోగతిపై సమీక్షించారు. ఈ వీసీకి జిల్లా నుంచి అదనపు కలెక్టర్ సంపత్ రావు సంబంధిత శాఖల అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతీ గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పనులు చేపట్టి పనులు కోరిన కూలీలకు ఉపాధి కల్పించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని 12,516 గ్రామ పంచాయతీల్లో పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. మిగిలిన 244 గ్రామ పంచాయతీల్లో వెంటనే ప్రారంభించాలని సూచించారు. ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇంకుడు గుంతలు, బోర్వెల్ రీచార్జ్ పనులు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, చెరువుల పునరుద్ధరణకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించే పనులను చేపట్టాలని తదితర సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ రవీందర్, డీపీఓ వెంకయ్య, డీఐఓ అప్పలనాయుడు, జిల్లా ఉద్యానశాఖ అధికారి సంజీవ రావు, మిషన్ భగీరథ డీఈ సునీత, జిల్లా వ్యవసాయ అధికారి సురేశ్‌కుమార్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి కొమురయ్య, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖల ఈఈలు, తదితరులు పాల్గొన్నారు.


