ములుగు రూరల్: ప్రజావాణి దరఖాస్తులు సంబంధిత శాఖల అధికారుల వద్ద పెండింగ్ లేకుండా చూడాలని కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజల నుంచి దరఖాస్తులను అదనపు కలెక్టర్ మహేందర్‌జీతో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలన్నారు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి సాధ్యాసాధ్యాలను అర్జీదారులకు తెలియజేయాలన్నారు.
ప్రజావాణిలో 28 దరఖాస్తులు
జిల్లాకేంద్రంలో నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 28 దరఖాస్తులను స్వీకరించారు. ఇందులో భూ సమస్యలు 9, ఇందిరమ్మ ఇళ్లు 02, పెన్షన్‌లు3, ఇతర సమస్యలకు సంబందించినవి 14 వచ్చినట్లు తెలిపారు. దరఖాస్తులను సంబందిత శాఖల అధి కారులకు బదలాయించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్‌రావు, జిల్లా రెవెన్యూ అధికారి రవికుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సంతకాలు ఫోర్జరీ చేశారని ఫిర్యాదు
వాజేడు: మండలపరిధిలోని ధర్మవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ కాక సుమతి తన సంతకాలు ఫోర్జరీ చేశారని ఆరోపిస్తూ సోమవారం కలెక్టర్ హేమంత్ సహదేవరావు, డీపీఓ వెంకయ్యకు సోమవారం ఫిర్యాదు చేశారు. తీర్మాణాలు, గ్రామసభ, ఎజెండా, వీబీజీరామ్‌జీ కి సంబంధించిన పుస్తకాల్లో ఫోర్జరీ చేశారని, తక్షణమే విచారణ జరిపి చర్య తీసుకోవాలని విన్నవించారు. కాగా తక్షణమే స్పందించిన కలెక్టర్ విచారణ చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డీఎల్‌పీఓ శ్రీధర్‌రావు ధర్మవరం జీపీకి చేరుకుని విచారణ చేశారు.
గిరిజన దర్బార్‌లో..
ఏటూరునాగారం: ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో స్వీకరించిన దరఖాస్తులను నిబంధనల మేరకు తక్షణమే పరిష్కరించాలని, పెండింగ్‌లో ఉండొద్దని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో తెలిపారు. ఈ మేరకు సోమవారం ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో విద్యుత్, పోలీస్, గిరిజన సంక్షేమం, విద్య, రహదారులు, డ్రెయినేజీలు, ఉద్యోగాలు, భూ సమస్యలు తదితర అంశాలకు సంబంధించి దరఖాస్తులు అందాయి. భూ ఆక్రమణలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ అంశంపై కన్నాయిగూడెం పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన ఫిర్యాదు చేశారు. కొండాయిలో గోవిందరాజుల జాతరకు మండపం, ఎదురుకోలు తదితర ఏర్పాట్లకు సంబంధించి అనుమతులు లేదా ఆర్థిక సహాయం మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు సమర్పించారు. 2012 డీఎస్సీ మెరిట్ జాబితా, డీఎల్‌ఎస్‌సీ 2012 వివరాలు, పెండింగ్ వేతనాల చెల్లింపు, నియామక అభ్యర్థనలకు సంబంధించి కూడా వినతులు సమర్పించారు. పట్టా పాస్‌బుక్‌ల కోసం మూడు దరఖాస్తులు అందగా, ఇందిరా జలప్రభ పథకం కింద బోర్‌వెల్స్ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తులు అందాయి. వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి, నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ ప్రతాప్, ఏఓ అనిల్, డీడీ జనార్దన్, వివిధ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో
కలెక్టరేట్, ఐటీడీఏలో అర్జీల స్వీకరణ


