● ఆర్టీసీ వరంగల్ రీజియన్‌కు వచ్చిన దసరా ఆదాయం ● ‘మహాలక్ష్మి’కింద 39.98 లక్షల మంది ప్రయాణం
హన్మకొండ: బతుకమ్మ, దసరా పండుగలకు టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజియన్ రూ.33.63 కోట్ట ఆదాయాన్ని రాబట్టుకుంది. పండుగల నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా ఈ నెల 9 నుంచి 25వ తేదీ వరకు రెగ్యులర్ బస్సులతోపాటు ప్రత్యేక సర్వీసులు నడిపింది. వరంగల్ రీజియన్‌లోని 9 డిపోల ద్వారా 63.76 లక్షల కిలో మీటర్లు బస్సులు తిరిగి 61.07 లక్షల మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేసింది. రూ.33,63,14,000 ఆదాయాన్ని సాధించింది. ఇందులో మహాలక్ష్మి పథకం ద్వారా 39.98 లక్షల మంది ప్రయాణించారు.
ఆర్టీసీ బస్సులోనే సురక్షిత ప్రయాణం
ఆర్టీసీ బస్సులోనే సురక్షిత ప్రయాణం. ఈ నమ్మకంతో ప్రయాణం చేసిన వారికి సంస్థ కృతజ్ఞతలు తెలుపుతోంది. అధికారులు, కార్మికులు సమష్టి కృషి, సమన్వయంతో అహర్నిశలు శ్రమించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అత్యంత సమర్థవంతంగా నడిపించిన డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ మెకానిక్‌లు, ట్రాఫిక్ సూపర్ వైజర్లు, డిపో మేనేజర్లు, పాలనా సిబ్బందికి ధన్యవాదాలు.
– వరంగల్ ఆర్‌ఎం ఎస్.భవాని ప్రసాద్


