గడ్డికి గిరాకీ.. ధరకు రెక్కలు! | - | Sakshi
Sakshi News home page

గడ్డికి గిరాకీ.. ధరకు రెక్కలు!

Oct 26 2026 2:16 AM | Updated on Oct 26 2026 2:16 AM

గడ్డికి గిరాకీ.. ధరకు రెక్కలు!

సాక్షి ప్రతినిధి, వరంగల్‌:

వరి పంట చేతికొస్తున్నా పశుపోషకులకు మాత్రం గడ్డి దొరకడం గగనంగా మారుతోంది. ఒకవైపు పశువుల సంఖ్య భారీగా ఉండడం.. మరోవైపు డిమాండ్‌కు సరిపడా ఎండు వరిగడ్డి అందుబాటులో లేకపోవడంతో ధరలు ౖపైపెకి దూసుకెళ్తున్నాయి. ఉమ్మడి వరంగల్‌లో ఏటా సుమారు 1,01,49,078 క్వింటాళ్ల ఎండు వరి గడ్డి అవసరం కాగా, ఈసారి అందుబాటులో ఉన్నది సుమారు 89,59,296 క్వింటాళ్లు మాత్రమే. అవసరంతో పోలిస్తే లభ్యత దాదాపు 88.3 శాతమే. ఇదే మార్కెట్‌లో ధరల పెరుగుదలకు కారణమవుతోందని అధికారులు చెబుతున్నారు.

45.72 లక్షల పశుసంపద

వ్యవసాయ శాఖ, తెలంగాణ సామాజిక, ఆర్థిక గణాంకాలు –2025 ప్రకారం ఉమ్మడి వరంగల్‌లో పశుసంపద భారీగా ఉంది. మొత్తం 45.72 లక్షల పశుసంపద ఉండగా.. అందులో గొర్రెలు 27.56 లక్షలు, మేకలు 5.88 లక్షలు, ఆవులు/పశువులు 6.12 లక్షలు కాగా, గేదెలు 6.16 లక్షలు ఉన్నాయి. అంటే ఆవులు, గేదెలు కలిపి 12.28 లక్షలు. వాటికి ఏడాది పొడవునా పొడి మేత అవసరం ఉంటుంది. గొర్రెలు, మేకలకు కూడా మేత అవసరమే అయినప్పటికీ వాటి ఆహార విధానం భిన్నంగా ఉంటుంది.

కోతలు మొదలు..

హనుమకొండ, వరంగల్‌, జనగామ, మహబూబాబాద్‌ జిల్లాల్లో వరి కోతలు ఊపందుకుంటున్నాయి. జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మాత్రం మరో 10 – 15 రోజులు పట్టే అవకాశం ఉంది. కోతల సమయం ప్రారంభం కావడంతోనే ఎండు గడ్డికి డిమాండ్‌ ఏర్పడింది. పశువులు లేని రైతుల పొలాల వద్దకు గడ్డి వ్యాపారులు, కొనుగోలుదారులు ముందుగానే వెళ్లి గడ్డిని కొనుగోలు చేస్తున్నారు. దీంతో పంట రైతుకు ధాన్యంతో పాటు గడ్డి కూడా అదనపు ఆదాయ వనరుగా మారుతోంది. మరోవైపు పశువులను సాకుతున్న రైతులకు మాత్రం ఇదే గడ్డి అదనపు ఖర్చుగా మారుతోంది.

ట్రాక్టర్‌ గడ్డి ధర రూ.12 వేలపైనే..

గడ్డి కొరత ప్రభావం నేరుగా ధరలపై పడుతోంది. 2024 – 25లో ట్రాక్టర్‌ ఎండు వరి గడ్డి లోడ్‌ ధర సుమారు రూ.4,500 నుంచి రూ.7,500 వరకు ఉండేది. ప్రస్తుతం అదే గడ్డి ట్రాక్టర్‌ లోడు రూ.8 వేల నుంచి రూ.12 వేల వరకు ధర పలుకుతోంది. సుమారు 67 శాతం పెరుగుదల కనిపిస్తోంది. పాడి రైతుకు పశువు అంటే రోజువారీ ఆదాయ వనరు. పాలు అమ్మితేనే కుటుంబానికి నగదు వస్తుంది. కానీ, ఆ పశువుకు మేత మాత్రం ప్రతిరోజూ కావాలి. గడ్డి ధర పెరగడం వల్ల.. గడ్డి ఖర్చు, దాణా ఖర్చు, పశుపోషణ ఖర్చులు భారం అవుతున్నాయి. మరోవైపు మేత ఖర్చు భరించలేక పశువులకు తగినంత మేత ఇవ్వకపోతే పాల దిగుబడిపై ప్రభా వం పడే అవకాశం ఉంటుంది. అంటే రైతుకు ఒకవైపు నిర్వహణ వ్యయం పెరుగుతుండగా.. మరో వైపు ఆదాయం తగ్గే ప్రమాదం ఏర్పడుతుంది.

పశుగ్రాసం కొరతతో పశుపోషకులపై భారం

ఉమ్మడి వరంగల్‌లో 11.90 లక్షల క్వింటాళ్ల లోటు

ఏటా 1.01 కోట్ల క్వింటాళ్ల అవసరం.. 89.59 లక్షల క్వింటాళ్లే లభ్యత

ట్రాక్టర్‌ గడ్డి ధర రూ.8 వేల నుంచి రూ.12 వేలు

ఈసారి ఏకంగా 60 – 78 శాతం వరకు ధరల పెంపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement