యాటతో మొక్కు చెల్లిస్తున్న భక్తులు
సమ్మక్క గద్దె వద్ద మొక్కులు చెల్లిస్తున్న భక్తులు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: సమ్మక్క–సారలమ్మ వనదేవతలు కొలువైన మేడారంలో ముందస్తు జాతర సందడి నెలకొంది. ఆదివారం సెలవు రోజు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ప్రైవేటు వాహనాల్లో తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి, అమ్మవార్ల గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులతో గద్దెల ప్రాంగణం సందడిగా కనిపించింది. సుమారుగా 30వేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. గద్దెల వద్ద భక్తుల భద్రతకు పోలీసులు చర్యలు తీసుకున్నారు.
గద్దెల వద్ద ప్రత్యేక పూజలు
మేడారానికి చేరుకున్న భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం సమ్మక్క–సారలమ్మ గద్దెలను దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా అమ్మవార్లకు మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని వనదేవతలను వేడుకున్నారు. అనంతరం భక్తులు మేడారం పరిసరాల్లోని అటవీ ప్రాంతంలో చెట్ల కింద విడిది చేశారు. వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు ఆరగించి ఆనందంగా గడిపారు.
ముందస్తు ఏర్పాట్లు అవసరం
వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 నుంచి 20వ తేదీ వరకు మేడారం మినీ జాతర జరగనుంది. జాతరకు ఇంకా మూడు నెలల సమయం ఉన్నప్పటికీ భక్తుల రాక పెరుగుతుండడంతో అధికారులు ముందస్తు ఏర్పాట్లపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. తాగునీరు, పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, వాహనాల పార్కింగ్ వంటి సౌకర్యాలను మెరుగుపర్చాలి. జంపన్నవాగు, అమ్మవార్ల గద్దెల వద్ద భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి. రాబోయే రోజుల్లో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నందున సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది.
వేలాదిగా తరలివచ్చిన భక్తులు
జంపన్నవాగులో పుణ్యస్నానాలు
గద్దెల వద్ద మొక్కులు


