ములుగు: రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నూతన జిల్లా అధ్యక్షుడిగా కాట్రగడ్డ సతీశ్‌బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా కేంద్రంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌లో ఆదివారం నిర్వహించిన ఎన్నికల్లో కేవలం సతీశ్‌బాబు మాత్రమే అధ్యక్షుడిగా నామినేషన్ వేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అనంతరం ఆయనను కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు వంగ రవి యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు షర్ఫుద్దీన్, బోయిని రాజు, గుండెబోయిన రమేశ్, బోడ రఘు, ఇమ్మడి రమేశ్, గందె రాజు పాల్గొన్నారు.
కరాటే పోటీల్లో
విద్యార్థినుల ప్రతిభ
ఏటూరునాగారం: ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో నిర్వహించిన 5వ సౌత్ జోన్ కరాటే పోటీల్లో మండల కేంద్రంలోని కరాటే అకాడమికి చెందిన విద్యార్థినులు ప్రతిభ కనబర్చారు. ఈ మేరకు కరాటే మాస్టర్ ఆదివారం వారి వివరాలను వెల్లడించారు. అండర్ 21 విభాగంలో అలువాల సుమనశ్రీ, 52 కేజీల విభాగంలో వసంత విశాల్ సాయి బ్రౌంజ్ మెడల్స్ సాధించారని తెలిపారు. అలాగే అండర్ 8 విభాగంలో ఆధ్య సిల్వర్ మెడల్ సాధించినట్లు హుస్సేన్ వెల్లడించారు.
పేదల పక్షాన నిలిచేది కమ్యూనిస్టులే
భూపాలపల్లి అర్బన్: పేదలు, కార్మికులు, సామాన్య ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడేది కమ్యూనిస్టులేనని సీపీఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ అన్నారు. పట్టణంలోని 17వ వార్డు సుభాష్ కాలనీలో సీపీఐ శాఖ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నూతన జెండా గద్దెను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నిత్యావసర ధరలను నియంత్రించడంలో విఫలమైందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.


